Champions Trophy | భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించేందుకు రెడీ అయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉన్నది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్నది. టీమిండియా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనున్నది. ఐసీసీ టోర్నీల్లో మంచి రికార్డు ఉన్న కోహ్లీ నుంచి భారత జట్టు ఈ సారి సైతం మంచి ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నది. అయితే, ఇటీవల ఫామ్ లేమితో ఇబ్బందులుపడుతుండగా.. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో అర్ధ సెంచరీ చేయడం భారత్‌కు ఊరటనిస్తున్నది. చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మ్యాచులన్నీ దుబాయిలో జరుగనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్స్ పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ గ్రూప్-ఏలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ గ్రూప్-బీలో ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీకి 2009 నుంచి 2017 వరకు ప్రతి నాలుగు సంవత్సరాలకోసారి జరిగింది. కానీ, తర్వాత కొవిడ్ మహమ్మారి తర్వాత వాయిదాపడింది. ఈ టోర్నీ 1998లో ప్రారంభమైంది. ప్రతి రెండు సంవత్సరాలకోసారి నిర్వహించింది.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ పేరిట ఉన్నది. ఈ టోర్నీలో 17 మ్యాచుల్లో 52.73 సగటుతో 88.77 స్ట్రయిక్ రేట్‌తో 791 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. గేల్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టే అవకాశం ఉంది. విరాట్ చాంపియన్స్ ట్రోఫీలో 13 మ్యాచుల్లో 88.16 సగటు, 92.32 స్ట్రయిక్ రేట్‌తో 529 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలున్నాయి. ఈ టోర్నమెంట్లో కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 96 నాటౌట్. 2017లో బంగ్లాదేశ్‌పై ఈ స్కోర్‌ను చేయగలిగాడు. పాకిస్థాన్‌పై 81 నాటౌట్, దక్షిణాఫ్రికాపై 76 నాటౌట్‌గా నిలిచాడు. గేల్ రికార్డుకు కోహ్లీ ఇంకా 263 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ పరుగులు చేస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. క్రిస్ గేల్ 791 (17 మ్యాచులు), మహేలా జయవర్ధనే 742 (22), శిఖర్ ధావన్ 701 (10), కుమార్ సంగక్కర 683 (22), సౌరవ్ గంగూలీ 665 (13), జాక్వెస్ కల్లిస్ 653 (17), రాహుల్ ద్రవిడ్ 627 (19), రికీ పాంటింగ్ 593 (18), శివ్ నారాయణ్ చందర్‌పాల్ 587 (16), సనత్ జయసూర్య 536 (20), విరాట్ కోహ్లీ 529 (13) పరుగులు చేశాడు. కోహ్లీ కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులుపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆకట్టుకోలేకపోయాడు. కోహ్లీ 12 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చినా.. రాణించలేకపోయాడు. మోకాలి వాపు కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆడలేకపోయాడు. రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. మూడో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు.