Virat Kohli : అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం, టన్నులకొద్దీ పరుగులు, లెక్కలేనన్ని రికార్డులు.. ఇలా ఎన్నో ఘనతలు సాధించిన విరాట్ కోహ్లీ (Virat Kohli ) ఓ అనామక బౌలర్‌ను ఎదుర్కోలేక పోయాడు. బంగ్లాదేశ్‌తో కాన్పూర్‌లో జరుగబోయే రెండో టెస్టుకోసం నెట్స్‌లో సాధన చేస్తున్న కోహ్లీకి ఓ యువ బౌలర్ షాకిచ్చాడు. అంతుపట్టని బౌలింగ్‌తో, వైవిధ్యంతో విరాట్‌ను బోల్తా కొట్టించాడు. అలాగని ఒకసారి కాదు రెండుసార్లు వికెట్ పడగొట్టాడు. దాంతో, అతడి పేస్‌కు కోహ్లీ ఫిదా అయ్యాడు.
తనను రెండు సార్లు ఔట్ చేసిన బౌలర్‌ను కోహ్లీ నీ వయసెంత? అని అడిగాడు. మరింత కష్టపడు జట్టులోకి వస్తావ్ అని ఆ నెట్ బౌలర్‌పై ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ తనను మెచ్చుకోవడంతో ఆ యువ పేసర్ ఉబ్బితబ్బిబ్వవుతున్నాడు. ఇంతకు అతడి పేరు ఏంటంటే..? జంషెడ్ అలామ్ (Jamshed Alam).
లక్నోకు చెందిన అతడు కోహ్లీకి బౌలింగ్ గురించి ఏం చెప్పాడంటే.. ‘నేను నెట్స్‌లో కోహ్లీకి 24 బంతులు సంధించాను. 135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాను. రెండుసార్లు కోహ్లీ వికెట్ సాధించాను. కోహ్లీ ప్రశంసతో నాకు చంద్రుడిపై తేలిపోతున్నట్టుగా ఉంది’ అని 22 ఏండ్ల జంషెడ్ తెలిపాడు. ఇక చెపాక్‌లో 6, 17 పరుగులతో నిరాశపరిచిన కోహ్లీ భారీ స్కోర్ బాకీ ఉన్నాడు. తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా సిరీస్ పట్టేయాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లోనైనా విరాట్ 30 టెస్టు సెంచరీ కొట్టాలని యావత్ భారతం కోరుకుంటోంది.