Travis Head : చెపాక్ టెస్టులో మెరుపు సెంచరీతో రిషభ్ పంత్ (Rishab Pant) తన పునరామనాన్ని ఘనంగా చాటాడు. దాంతో, ఇప్పుడు పంత్.. పేరు వింటే చాలు ఆస్ట్రేలియన్లకు వెన్నులో వణుకు పుడుతోంది. మరి.. గత రెండు పర్యటనల్లో పంత్ చెలరేగిన తీరు.. విరుచుకుపడ్డ విధానం.. మ్యాచ్‌లు గెలిపించిన సందర్భాలు కంగారూలు మర్చిపోలేదు. ఇప్పుడు నవంబర్‌లో మరోసారి పంత్ వస్తున్నాడని తెలియగానే వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీకి మరో రెండు నెలలు ఉంది. ఆసీస్ పాలిట విలన్ అయిన పంత్ మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అందుకనే కెప్టెన్ కమిన్స్ ‘ఈసారి పంత్ దూకుడుకు కళ్లెం వేస్తా’ అని మైండ్ గేమ్ మొదలెట్టేశాడు. ఇక ఆ జట్టు విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head), వన్డే సారథి మిచెల్ మార్ష్‌లు అయితే.. పంత్ ఇండియన్ కాదు ఆస్ట్రేలియన్ అంటూ అతడి ఆట క్రెడిట్ కొట్టేసే పనిలో ఉన్నారు.
‘భారత క్రికెటర్లలో ఆస్ట్రేలియన్‌గా నేను నమ్మే వ్యక్తి రిషభ్ పంత్. దూకుడుగా ఆడే అతడి సహజ స్వభావం.. బౌలర్లపై ఎదురుదాడికి దిగే అతడి ధైర్యం, తెగింపు.. ఇవన్నీ అతడి ఆటను చాలా ఆకర్షణీయం మార్చేశాయి’ అని హెడ్ అన్నాడు. ఇక మార్ష్ సైతం పంత్‌ను ఆకాశానికెత్తేశాడు. ‘పంత్ ఒక విధ్వంసక ఆటగాడు. నేనైతే అతడిని ఆస్ట్రేలియా క్రికెటర్ అని అంటాను. గత రెండేండ్లలో అతడు ఎన్నో కష్టాలు అనుభవించాడు. చివరకు రాకెట్లా మళ్లీ దూసుకొచ్చాడు. అతడు గెలవడాన్ని ఇష్టపడుతాడు. ప్రశాంతంగా ఉంటేనే పోటీని ఆస్వాదించే క్రికెటర్ పంత్. మైదానంలో ఎల్లప్పుడూ సరదాగా, నవ్వుతూ ఉంటాడు’ అని మార్ష్ అన్నాడు.
Competitive. Fierce. Effortless.#MitchellMarsh and #TravisHead believe #RishabhPant‘s fiery spirit and natural competitiveness would make him a perfect fit among the Aussies, setting him apart! 😬💪🏻 #ToughestRivalry
Watch #ToughestRivalry in action during #INDvAUSonStar… pic.twitter.com/Ls6vwjWDjC
— Star Sports (@StarSportsIndia) September 25, 2024
ఒకప్పుడు ఆస్ట్రేలియా పర్యటన అంటే ‘వామ్మో.. వాళ్లతోనా?.. స్లెడ్జింగ్‌తో చంపేస్తారు.పేస్‌తో పడగొడతారు? కనీసం సిరీస్ సమం చేసినా చాలు?’.. ఇలా అనేక భావనలు సగటు భారతీయ అభిమానుల్లో ఉండేది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా రికార్డు మరీ అధ్వాన్నంగా ఉండడమే అందుకు కారణం. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఆసీస్ పర్యటన అంటే చాలు భారత అభిమానుల్లో ఎక్కడ లేని జోష్. గెలుపుపై అంతకుమించిన ధీమా. అందుకు కారణం చాలా పేర్లే చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అన్నట్టు కయ్యానికి కాలుదువ్వే విరాట్ కోహ్లీ(Virat Kohli) దూకుడు మంత్ర.. యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా వికెట్ల వేట.. స్పిన్‌తో పడగొట్టే అశ్విన్, జడేజా ద్వయం. అయితే.. వీళ్లందరి కంటే ఎక్కువ క్రెడిట్ మాత్రం ఆ ఒక్కడిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ ఒక్కడే రిషభ్ పంత్.
ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22న ఆసీస్ గడ్డపై మొదలవ్వనుంది. 1992 తర్వాత తొలిసారి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా నిర్వహిస్తున్నారు. దాంతో, టీమిండియా హ్యాట్రిక్ కొడుతుందా? లేదా కమిన్స్ సేన ప్రతీకార విజయంతో చెలరేగుతుందా? అని ఇరుదేశాల అభిమానులు ఈ ట్రోఫీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.