Mahesh Babu | టాలీవుడ్ జక్కన్న సూపర్ మహేశ్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ఎంబీ29కి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్‌పైకి మూవీని తీసుకెళ్లనున్నట్లు తెలుస్తున్నది. ఆర్ఆర్ఆర్ మూవీతో రాజమౌళి పాన్ ఇండియాను దాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నది. ఈ క్రమంలో ప్రతి అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపించినా.. తాజాగా విదేశీ బ్యూటీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది.
అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని మహేశ్ సినిమాలో ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజిబెత్ని ఎంపిక చేసినట్లు టాక్. అలాగే, మరో ఇద్దరు విదేశీ బ్యూటీల పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. వచ్చే నెలలో ఈ చిత్రంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇక ఇటీవల మహేశ్ కొత్త లుక్ అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. గతంలో ఎన్నడూ కనిపించని విధంగాలాంగ్ హెయిర్, గడ్డం, మీసకట్టుతో పలుచోట్ల దర్శనమిచ్చారు. జక్కన్న మూవీ కోసమే మహేశ్ కొత్త అవతారమని భావిస్తున్నారు. మరో వైపు మహేశ్ లుక్ కోసం విదేశాల నుంచి హెయిర్ స్టయిలిస్ట్లను సైతం పిలిపించబోతున్నారని.. త్వరలోనే కొత్త లుక్‌లో కనిపించే అవకాశాలు లేకపోలేదని సమాచారం. మూవీలో మహేశ్ లుక్ కోసం టీమ్ ఎనిమిది లుక్స్‌ని సిద్ధం చేసిందని.. ఇందులో ఫైనల్ డిసైడ్ చేయాల్సి ఉందని టాక్ నడుస్తున్నది.
ఈ మూవీకి రాజమౌళి ‘గరుడ’ అని టైటిల్‌ని ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ ఇన్‌స్టాలో చేసిన బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఎస్ఎస్ఎంబీ29 అంటూ హ్యాట్టాగ్ ఇచ్చారు. దాంతో ఈ మూవీకి గరుడ టైటిల్ అని వార్తలు వచ్చాయి. అయితే, కొద్దిరోజుల కిందట రాజమౌళి సైతం స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బహుబలి తర్వాత తాను చేయబోయే ప్రాజెక్టు గరుడ అని వెల్లడించారు. పూర్తి వివరాలను మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం మహేశ్, రాజమౌళి మూవీ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ టీమ్ ఎప్పుడు అభిమాలకు అప్డేట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.