Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) రజత పతకం దక్కకపోవడం యావత్ భారతాన్ని నిరాశపరిచింది. జెండా పండుగకు ముందు రోజే అర్బిట్రేషన్ కోర్టు వినేశ్‌కు పతకం ఇవ్వడం లేదంటూ చేదు వార్త చెప్పింది. అయితే.. ఏ కారణం చెప్పకుండానే సదరు కోర్టు వినేశ్ ఫోగొట్కు పతకం నిరాకరించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. తాజాగా ఆమె కేసును వాదిస్తున్న న్యాయవాద బృందంలోని విదుష్పత్ సింఘానియా (Vidushapt Singhania) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
‘వినేశ్ ఫొగాట్‌కు రతజం నిరాకరించడంపై సీఏఎస్ ఏక వ్యాఖ్య తీర్పు ఇచ్చిందంతే. ఇంకా పూర్తిస్తాయి తీర్పు రావాల్సి ఉంది. అయితే.. బుధవారం రాత్రి కోర్టు వినేశ్‌కు ఉమ్మడిగా సిల్వర్ మెడల్ ఇవ్వలేమని చెప్పేసింది. అందుకు కారణం ఏమీ చెప్పలేదు. అలాంటప్పుడు ఎందుకు ఈ విషయాన్ని ఆలస్యం చేశారు?’ అని సింఘానియా కోర్టును ప్రశ్నించాడు.
ఫైనల్స్‌కు ముందు తనపై అనర్హత వేటును ప్రశ్నిస్తూ వినేశ్ ఆగస్టు 7న అర్బిట్రేషన్ కోర్టు (Arbitration Court)కు అప్పీల్ చేసింది. దాంతో, ఆ కోర్టు మొదట ఆగస్టు 11న తీర్పును వెల్లడిస్తామని చెప్పింది. ఏమైందో తెలియదు ఆగస్టు 13కు తీర్పును వాయిదా వేసింది. దాంతో, ఆ రోజైనా వినేశ్ రజతంపై ఉత్కంఠ వీడుతుందని అంతా ఆశించారు.
వినేశ్, విదుష్పత్ సింఘానియా
కానీ, ఆర్టికల్ 18 సాకుగా చూపి కోర్టు తీర్పును ఆగస్టు 16 సాయంత్రం 6 గంటలకు వాయిదా వేసింది. అయితే.. అనూహ్యంగా ఆగస్టు 14 బుధవారం సీఏఎస్ వినేశ్‌కు రజతం ఇవ్వాలని ఆదేశించలేమని తేల్చేసింది. సీఏఎస్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. క్రీడలకు సంబంధించిన వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిస్తుంటుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగాట్ అంచనాలు అందుకుంటూ ఫైనల్ చేరింది. పసిడి ఫైట్ కాసేపట్లో ఉందనగా నిర్వాహకులు ఆమె బరువు కొలిచారు. అయితే.. 100 గ్రాముల అదనపు బరువు ఉండడంతో వినేశ్‌ను నిర్వాహకులు అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో,ఫైనల్ ఆడలేకపోయిన ఆమె అప్పీల్‌పై అర్బిట్రేషన్ కోర్టు (CAS)ను ఆశ్రయించింది. విశ్వ క్రీడల్లో విశేషంగా రాణించిన వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడల్ ఇస్తామని హర్యానాకు చెందని ఖాప్ పంచాయతీ (Khap Panchayat) ప్రకటించింది.