అహ్మదాబాద్ : దేశవాళీలో ప్రతిష్టాత్మక లిస్ట్-ఏ క్రికెట్ టోర్నీ అయిన విజయ్ హజారేకు వేళైంది. ఈ నెల 24 నుంచి జనవరి 18 వరకూ జరుగబోయే 19 మ్యాచ్లకు అహ్మదాబాద్, రాజ్కోట్, జైపూర్, బెంగళూరు ఆతిథ్యమివ్వనున్నాయి. మొత్తంగా 38 జట్లు (32 ఎలైట్, 6 ప్లేట్) నాలుగు గ్రూపులుగా విడిపోయి సాగనున్న ఈ టోర్నీలో అంతర్జాతీయ స్టార్లు భాగస్వాములవుతుండటం మరింత ఆకర్షణ తీసుకురానున్నది.దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు రిషభ్ పంత్, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడనుండటం మరో విశేషం.
2010 తర్వాత విజయ్ హజారే ఆడటం కోహ్లీకి ఇదే మొదటిసారి. రిషభ్ పంత్ నాయకుడిగా ఉన్న ఢిల్లీ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహించనున్నాడు. శార్దూల్ ఠాకూర్ సారథిగా ఉన్న ముంబై జట్టులో రోహిత్ ఆడతాడు. 14 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ బీహార్ జట్టు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. బోర్డుతో కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లు ఈ టోర్నీలో కనీసం రెండు మ్యాచ్లు అయినా ఆడాలని బీసీసీఐ ఆదేశించిన నేపథ్యంలో ‘రోకో’తో పాటు మిగతా ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్లకు ఆడేందుకు సిద్ధమయ్యారు.