పంచ రత్నాలు

ప్రపంచానికి క్రికెట్‌ను పరిచయం చేసిన ఇంగ్లండ్‌తో టీమ్ఇండియా వైరం ఇప్పటిది కాదు. దేశానికి స్వాతంత్య్రం రాకముందే భారత జట్టు ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లాడింది. 1933-34లో తొలిసారి భారత్ విచ్చేసిన ఇంగ్లిష్ జట్టు.. ఇప్పటి వరకు 15 సార్లు మనదేశంలో పర్యటించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ మధ్య 122 టెస్టులు జరుగగా.. అందులో టీమ్ఇండియా 26, ఇంగ్లిష్ జట్టు 47 మ్యాచ్‌లు నెగ్గాయి. 49 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. భారత గడ్డపై ఇరు జట్ల మధ్య 60 మ్యాచ్‌లు జరుగగా.. అందులో టీమ్ఇండియా 19, ఇంగ్లండ్ 13 మ్యాచ్‌లు నెగ్గాయి. సొంతగడ్డపై ఎప్పుడూ పటిష్టమే అయిన టీమ్ఇండియాపై ఇంగ్లండ్ జట్టు చివరిసారిగా 2012-13లో సిరీస్ విజయం సాధించింది.
పదహారోసారి ఇక్కడికి వస్తున్న ఇంగ్లండ్ జట్టుతో టీమ్ఇండియాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. తొలి టెస్టు వేదికైన చెన్నైలోనే భారత జట్టు మొదటిసారి (1952లో) ఇంగ్లండ్‌ను ఓడించింది. ముంబై దాడుల అనంతరం టీమ్ఇండియా తిరిగి మ్యాచ్ ఆడింది కూడా ఇక్కడే. ఇక భారత్ తరఫున టెస్టుల్లో మూడో ట్రిపుల్ సెంచరీకి వేదికైంది కూడా చెన్నై మైదానమే. మరో నాలుగు రోజుల్లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్ఇండియా సాధించిన మరపురాని విజయాలను ఓసారి నెమరువేసుకుంటే..
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
కుంబ్లే జాదూ..
2005-06, వేదిక: మొహాలీ దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ధాటికి మొహాలీలో ఇంగ్లండ్ కుదేలైంది. తొలి ఇన్నింగ్స్‌లో కుంబ్లే (5/76) దెబ్బకు ఇంగ్లిష్ జట్టు 300 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (95), ఇర్ఫాన్ పఠాన్ (52) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 338 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కుంబ్లే (4/70) మ్యాజిక్ రిపీట్ చేయడంతో పర్యాటక జట్టు 181 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ ముందు 144 పరుగుల లక్ష్యం నిలువగా.. సెహ్వాగ్ (76 నాటౌట్), ద్రవిడ్ (42) పని పూర్తిచేశారు.
ఇంగ్లండ్‌పై టీమ్ఇండియా సాధించిన ఐదు అపురూప విజయాలు
1 భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక స్కోరు 759/7 డిక్లేర్డ్. చెన్నై టెస్టులో టీమ్ఇండియా నమోదు చేసింది.
95 ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో బీఎస్ చంద్రశేఖర్ పడగొట్టిన వికెట్లు. కుంబ్లే (92) రెండో స్థానంలో ఉన్నాడు
7 ఇంగ్లండ్‌పై సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ చేసిన సెంచరీల సంఖ్య
ముంబై దాడుల తర్వాత..
2008, వేదిక: చెన్నై భారత టెస్టు చరిత్రలో ఈ మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ముంబై దాడులతో పరిమిత ఓవర్ల సిరీస్‌ను మధ్యలోనే రద్దు చేసిన ఇరు దేశాల బోర్డులు కాస్త తేరుకున్నాక చెన్నైలో తొలి టెస్టుకు సై అన్నాయి. భావోద్వేగాల మధ్య బరిలో దిగిన భారత్ భళా అనిపించింది. ఆండ్రూ స్ట్రాస్ (123) సెంచరీతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 315 పరుగులు చేయగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 241 రన్స్‌కే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో స్ట్రాస్ (108), కాలింగ్‌వుడ్ (108) మోతెక్కించడంతో ఇంగ్లండ్ 311/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ముందు 387 పరుగుల లక్ష్యం నిలిచింది. ఇంత భారీ టార్గెట్ ఛేదించడం అసంభవం అనిపించినా.. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ దూకుడుతో అసాధ్యం సుసాధ్యమైంది. సుడిగాలిలా రెచ్చిపోయిన వీరూ 68 బంతుల్లోనే 83 పరుగులు చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. గౌతమ్ గంభీర్ (66), వీవీఎస్ లక్ష్మణ్ (26) రాణించారు. 32వ ఓవర్లో క్రీజులో అడుగుపెట్టిన సచిన్ (103 నాటౌట్) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించగా.. అతడికి యువరాజ్ సింగ్ (85 నాటౌట్) చక్కటి సహకారం అందించాడు. ఈ శతకం దేశానికి అంకితమన్న టెండూల్కర్.. ముంబై దాడుల్లో మృతులకు భారత జట్టు తరఫున ఇదే మా నివాళి అని ప్రకటించడం అభిమానులను కట్టిపడేసింది.
అదే మొదలు..1952, వేదిక: చెన్నై
అప్పటికే రెండు దశాబ్దాలుగా ఇంగ్లండ్‌తో పోటీపడుతున్న భారత్‌కు 1952లో తొలి విజయం దక్కింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన చివరి టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. వినూ మన్కడ్ (8/55) దెబ్బకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకే పరిమితం కాగా.. పంకజ్ రాయ్ (111), పాలీ ఉమ్రిగర్ (130 నాటౌట్) శతకాలు బాదడంతో భారత్ 457/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ వినూ, గులామ్ అహ్మద్ నాలుగేసి వికెట్లతో రెచ్చిపోవడంతో ఇంగ్లిష్ జట్టు 183 పరుగులుకే ఆలౌటవడంతో భారత్ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది.
పుజారా డబుల్ ధమాకా..
2012-13, వేదిక: అహ్మదాబాద్ నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన ఇంగ్లండ్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సిరీస్ తొలి మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా (206 నాటౌట్) దంచికొట్టడంతో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. పుజారాతో పాటు సెహ్వాగ్ (117), యువరాజ్ సింగ్ (74) రాణించడంతో భారత్ 521/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. టెస్టుల్లో పుజారాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అనంతరం ప్రజ్ఞాన్ ఓఝా (5/45) ధాటికి ఇంగ్లండ్ 191 పరుగులకే ఆలౌటై.. ఫాలోఆన్ ఎదుర్కొంది. ఈ సారి కెప్టెన్ కుక్ (176), ప్రియర్ (91) పోరాడటంతో ఇంగ్లిష్ జట్టు 406 పరుగులు చేసింది. దీంతో టీమ్ఇండియా ముందు 77 పరుగుల లక్ష్యం నిలువగా.. భారత్ సునాయాసంగా గెలుపొందింది.
కరుణ్ ట్రిపుల్ సెంచరీ
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడింట ఓడి అప్పటికే సిరీస్ కోల్పోయి చివరి టెస్టు ఆడేందుకు చెన్నై చేరిన ఇంగ్లిష్ జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా చుక్కలు చూపెట్టింది. తమ టెస్టు చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసి ఇంగ్లిష్ జట్టును చెడుగుడాడుకుంది. మొయిన్ అలీ (146), జో రూట్ (88) రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులు చేసింది. అనంతరం కరుణ్ నాయర్ (303 నాటౌట్), లోకేశ్ రాహుల్ (199) దెబ్బకు భారత్ 759/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత్ తరఫున టెస్టుల్లో కరుణ్ నాయర్‌ది మూడో ట్రిపుల్ సెంచరీ కాగా.. కేఎల్ రాహుల్ పరుగు తేడాతో ద్విశతకం కోల్పోయాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (7/48) స్పిన్ మ్యాజిక్కు ఇంగ్లిష్ జట్టు 207 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు.. 4-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
తాజావార్తలు
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!