రాంచీ : వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) మళ్లీ చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లతో ఊచకోత కోశాడు. విజయ్ హజారే టోర్నీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న వన్డేల్లో సెన్షేషనల్ సెంచరీ కొట్టేశాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డ బీహారీ యువ కెరటం.. కేవలం 84 బంతుల్లో 190 రన్స్ చేసి ఔటయ్యాడు. తాజాగా ముగిసిన అండర్19 ఆసియాకప్‌లోనూ సెంచరీతో హోరెత్తించిన వైభవ్.. ఇవాళ రాంచీలో జరుగుతున్న మ్యాచ్‌లో దుమ్మురేశాడు. సూర్యవంశీ ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు, 16 బౌండరీలు ఉన్నాయి. 226 స్ట్రయిక్ రేట్‌తో వైభవ్ తన పవర్ హిట్టింగ్ ప్రదర్శించాడు.
టాస్ గెలిచిన బీహార్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఫస్ట్ వికెట్‌కు వైభవ్, మంగళ్ ఇద్దరూ కలిసి 158 రన్స్ జోడించారు. ఆ తర్వాత జట్టు స్కోరు 261 రన్స్ వద్ద ఉన్న సమయంలో వైభవ్ వ్యక్తిగతంగా 190 రన్స్ చేసి నిష్క్రమించాడు. 14 ఏళ్ల సూర్యవంశీ బ్యాటింగ్ రికార్డులను తిరగరాశాడు. లిస్టు ఏ మ్యాచుల్లో సెంచరీ చేసిన యువ బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడతను. వన్డే క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో 150 రన్స్ చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు.
తొలి బంతి నుంచే హిట్టింగ్ చేసిన సూర్యవంశీ కేవలం 36 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత 54 బంతుల్లో అతను 150 రన్స్ మార్క్ క్రాస్ చేశాడు. తాజా సమాచారం ప్రకారం బీహార్ 29 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 272 రన్స్ చేసింది.