సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలోని వేర్వేరు చోట్ల ఆబ్కారీ పోలీసులు దాడులు జరిపి, నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యంతో పాటు నాటు సారాను పట్టుకున్నారు. ఈ కేసుల్లో ఆరుగురిని అరెస్టు చేయగా మరో 10మందిపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే…ఢిల్లీ, గోవా తదితర ప్రాంతాల నుంచి విమానాల్లో నగరానికి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యంను తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్టీఎఫ్ పోలీసులు పహడీషరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 41 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు తెలిపారు.
నాంపల్లిలో గంజాయి పట్టివేత..
మరో కేసులో నాంపల్లి, మేదర్ బస్తీలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న కాంబ్లె శ్యామ్‌సుందర్‌ను ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలకు సహకరిస్తున్న మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నాంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
నాటుసారా పట్టివేత..
రంగారెడ్డి జిల్లా, పల్లెచలుక తండాలో యథేచ్ఛగా నాటు సారా తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, సరూర్‌నగర్ డీటీఎఫ్ బృందాలు ఆమన్‌గల్ ఎక్సైజ్ పోలీసులతో కలిసి సంయుక్త దాడులు నిర్వహించా రు. ఈ దాడుల్లో 8లీటర్ల నాటు సారా, 580లీటర్ల బెల్లం పానకా న్ని ధ్వంసం చే శారు. అంతే కాకుండా నాటుసారా తయారు చేస్తున్న ఇస్లావత్ హిరియా, కె.దకి యా, జె.బిచా, హునియా, సలావత్ హుంగలను అరెస్టు చేశారు. మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.