తన వయసు పిల్లలంతా వేసవి సెలవులను ఆస్వాదిస్తుంటే.. ఐపీఎల్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 10సిక్సర్లతో 93) మాత్రం వరల్డ్ క్లాస్ బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. తన బ్యాట్ పవర్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. బంతి ఏ బౌలర్ చేతుల్లోంచి వచ్చినా ఈ బుడ్డోడి బ్యాట్ తాకగానే బౌండరీ దాటేస్తోంది. ఈ కుర్ర హీరో విధ్వంసానికి ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ బలైపోయింది..! చివరి మ్యాచ్‌ల్లో గెలిచి పరువైనా దక్కించుకోవాలని ఆశించిన జెయింట్స్ ఈ సూర్య ‘ప్రతాపం’ ముందు తేలిపోయింది. భారీ లక్ష్య ఛేదనలో ఖతర్నాక్ షాట్లతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన సూర్యవంశీ రాజస్థాన్‌కు అద్భుత విజయం అందించి జట్టును ప్లేఆఫ్స్ రేసులో నిలిపాడు.
జైపూర్: ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలువాల్సిన పోరులో రాజస్థాన్ రాయల్స్ సత్తాచాటింది. వైభవ్ వీరబాదుడు బ్యాటింగ్‌తో చెలరేగడంతో సొంతగడ్డపై మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లక్నోపై ఘన విజయం సాధించింది. లీగ్‌లో ఏడో విజయంతో పంజాబ్‌ను వెనక్కునెట్టి నాలుగో స్థానానికి చేరింది. తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా రాయల్స్ నేరుగా ప్లేఆఫ్స్ చేరుకోనుంది. లక్నో ఇచ్చిన 221 పరుగుల లక్షాన్ని రాయల్స్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. ధ్రువ్ జురెల్ (38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 నాటౌట్), స్టాండిన్ కెప్టెన్ యశస్వి జైస్వాల్ (43) కూడా రాణించారు. తొలుత మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 96), జోష్ ఇంగ్లిస్ (29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) మెరుపులతో లక్నో 20 ఓవర్లలో 220/5 స్కోరు చేసింది. వైభవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు జైస్వాల్, జురెల్ మెరుపులు తోడవడంతో భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ అలవోకగా అందుకుంది.ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ తొలి వికెట్‌కు 75 రన్స్ జోడించి విజయానికి బాటలు వేశారు. తొలి ఓవర్లోనే నాలుగు ఫోర్లు కొట్టిన జైస్వాల్.. మోసిన్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్లో 6, 4, 4, 4తో విజృంభించాడు. తన స్టయిల్‌కు భిన్నంగా తొలి పది బంతుల్లో 5 రన్స్ మాత్రమే చేసిన సూర్యవంశీ.. మయాంక్ ఐదో ఓవర్లో సిక్సర్ల ఖాతా తెరిచాడు. ప్రిన్స్ యాదవ్‌ను 6,4,6తో శిక్షించి పవర్ ప్లేను 71/0తో ముగించాడు. ఏడో ఓవర్లో జైస్వాల్‌ను ఔట్ చేసిన ఆకాశ్ సింగ్ లక్నోకు బ్రేక్ ఇచ్చాడు. కానీ, ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. జురెల్ తోడుగా సూర్యవంశీ ఒక్కసారిగా టాప్ గేర్‌లోకి వచ్చాడు. ఆకాశ్ వేసిన తొమ్మిదో ఓవర్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 26 రన్స్ పిండుకున్నాడు.
23 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ యంగ్ బ్యాటర్ తర్వాత మరింత భారీ షాట్లతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ప్రిన్స్ ఓవర్లో 6, 6 బాదాడు. ఇక, మయాంక్ బౌలింగ్‌లో ధ్రువ్ 4, 6, 6 కొడితే.. వైభవ్ రెండు సిక్సర్లు బాదడంతో ఏకంగా 29 రన్స్ లభించాయి. స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ బౌలింగ్‌లో 6, 4 కొట్టి 90ల్లోకి వచ్చిన వైభవ్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, మోసిన్ వేసిన 14వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి సమద్‌కు క్యాచ్ ఇవ్వడంతో రెండో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అప్పటికి 180/2తో నిలిచిన రాయల్స్ గెలుపు ఖాయం అయింది. వరుసగా 26 బంతుల్లో ఒక్క బౌండరీ ఇవ్వని లక్నో బౌలర్లు కాస్త ఒత్తిడి పెంచారు. ప్రిన్స్ బౌలింగ్‌లో సిక్స్‌తో జురెల్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. ఆఖరి ఓవర్ తొలి బంతికి డొనొవాన్ (16 నాటౌట్) విన్నింగ్ సిక్స్ కొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ భారీ స్కోరు అందించారు. ఈ ద్వయం రాజస్థాన్ బౌలర్లపై ఆది నుంచి విరుచుకుపడింది. ఆర్చర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మార్ష్ వరుస బంతుల్లో ఫోర్, సిక్స్‌తో పరుగుల ఖాతా తెరిచాడు. మరో ఎండ్‌లో ఇంగ్లిస్ కూడా బ్యాటు ఝులిపించడంతో పవర్‌ప్లేలోనే 83 పరుగులు లభించాయి. ఈ జోడీని విడదీసేందుకు రాయల్స్ స్టాండిన్ కెప్టెన్ జైస్వాల్ బౌలింగ్ మార్పులు ఫలించ లేదు. ఈ క్రమంలో 23 బంతుల్లో ఇంగ్లిస్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. బ్రిజేష్ శర్మ 8వ ఓవర్లో ఆఖరి బంతికి మార్ష్ సిక్స్‌తో లక్నో 105 పరుగులకు చేరుకుంది.
అయితే యశ్‌రాజ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన ఇంగ్లిస్..క్లీన్‌బౌల్డ్ కావడంతో తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇంగ్లిస్ స్థానంలో క్రీజులోకి వచ్చిన పూరన్ (16).. మార్ష్‌కు జతకలిశాడు. ఈ దశలో పరుగుల రాక ఒకింత మందగించినా..షనక బౌలింగ్‌లో ఫోర్‌తో మార్ష్ 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూరన్ ఔటైన తర్వాత వచ్చిన పంత్ (35) నెమ్మదిగా ఆడటంతో లక్నోకు పరుగుల రాక కష్టమైనా..మార్ష్ తన జోరు కొనసాగించాడు. ఒక దశలో 250 పరుగులు సాధిస్తుందనుకున్న లక్నో ఆఖరి ఓవర్లలో ఘోరంగా తడబడి 220 స్కోరుకు పరిమితమైంది.
3 లీగ్‌లో సూర్యవంశీ 10 అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టడం ఇది మూడోసారి. క్రిస్ గేల్ అత్యధికంగా నాలుగు సార్లు ఈ ఘనత సాధించాడు.
53 ఈ సీజన్లో సూర్యవంశీ కొట్టిన సిక్సర్లు. ఒక అంచెలో రెండో అత్యధికం. క్రిస్ గేల్ 2012లో 59 సిక్సర్లు కొట్టి టాప్‌లో ఉన్నాడు.
లక్నో: 20 ఓవర్లలో 220/5(మార్ష్ 96, ఇంగ్లిస్ 60, యశ్‌రాజ్ 2/35, ఆర్చర్ 1/39);
రాజస్థాన్: 19.1 ఓవర్లలో 225/3 (సూర్యవంశీ 93, జురెల్ 53*, ఆకాశ్ సింగ్ 1/54).
