సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Sep 04, 2020 , 00:56:05

ప్లిస్కోవాకు షాక్‌

ప్లిస్కోవాకు షాక్‌

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సంచనలం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) రెండో రౌండ్‌లోనే నిష్క్రమించింది. టాప్‌-2 ప్లేయర్లు ఆష్లే బార్టీ, సిమోనా హలెప్‌ కరోనా వైరస్‌ ఆందోళనతో టోర్నీకి దూరమవడంతో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన కరోలినా సరైన ప్రదర్శన చేయలేకపోయింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్లిస్కోవా 1-6, 6-7 (2/7)తో 50వ ర్యాంకర్‌ కరోలీన్‌ గ్రేసియా (ఫ్రాన్స్‌) చేతిలో కనీస పోరాటం లేకుండా గంటన్నర వ్యవధిలోనే ఓడిపోయింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి ప్లిస్కోవా తీవ్రంగా తడబడింది. గ్రేసియా షాట్లకు బదులివ్వలేక తొలి సెట్‌ను నిరాశాజనకంగా కోల్పోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకున్నా రెండో సెట్‌ టై బ్రేకర్‌లో పోటీనివ్వలేకపోయిన కరోలినా టోర్నీ నుంచి వెనుదిరిగింది. మ్యాచ్‌లో గ్రేసియా 30 విన్నర్లను సాధిస్తే ప్లిస్కోవా (13) అందులో సగం కూడా బాదలేకపోయింది. కాగా నాలుగో సీడ్‌ నవోమీ ఒసాక (జపాన్‌) 6-1, 6-2తో కమిలా జార్జీ (ఇటలి) పై గంటా పది నిమిషాల్లోనే గెలిచి మూడో రౌండ్‌లో అడుగుపెట్టింది. ఆరో సీడ్‌ పెట్రా క్విటోవా, అంజెలిక్‌ కెర్బెర్‌ కూడా రెండో రౌండ్లో విజయాలు సాధించారు.  

సెట్‌ కోల్పోయినా.. గెలిచిన జొకో

ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో జొకో 6-7(5/7), 6-3, 6-4, 6-2తో కైల్‌ ఎడ్‌మండ్‌ (బ్రిటన్‌)పై గెలిచాడు. తొలి సెట్‌ కోల్పోయినా ఆ తర్వాత తన మార్క్‌ ఆటతో జొకో అదరగొట్టాడు. మొత్తం ప్రత్యర్థి కన్నా రెట్టింపు ఏస్‌లు (16), విన్నర్లతో (52) ఆకట్టుకున్నాడు. కాగా ఈ ఏడాది ఓటమంటూ ఎరుగకుండా దూసుకెళుతున్న సెర్బియా స్టార్‌కు ఈ సీజన్‌లో ఇది 25వ విజయం కావడం విశేషం. అలాగే ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 7-5, 6-7(8/10), 6-3, 6-1తో బ్రాండన్‌ నకషిమపై గెలిచి మూడో రౌండ్‌ చేరాడు. మూడో సీడ్‌ డేనిల్‌ మద్వెదెవ్‌, ఏడో సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ రెండో రౌండ్‌లో గెలిచారు. మరోవైపు పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో భారత ఆటగాడు దివిజ్‌ శరణ్‌-నికోలా కసిచ్‌ (సెర్బియా) జోడీ 4-6, 6-3, 3-6తో నికోలా మెక్‌ట్రిక్‌-కూల్‌హోఫ్‌ చేతిలో పరాజయం పాలైంది. కాగా భారత యువ స్టార్‌ సుమిత్‌ నాగల్‌ పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో రెండో సీడ్‌ డొమెనిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)తో తలపడనున్నాడు. కాగా కరోనా వైరస్‌ కారణంగా బయో బబుల్‌ వాతావరణంలో ప్రేక్షకుల్లేకుండా యూఎస్‌ ఓపెన్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.logo