ఉక్రెయిన్‌పై రష్యా చేసిన అమానుష దాడిని ఖండించకుండా, ఆ పరిస్థితిని ఉపయోగించుకోవాలని చూసే దేశాల విషయంలో అమెరికా, దాని మిత్రదేశాలు తగిన చర్యలు తీసుకుంటాయట. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలెన్ వెల్లడించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె ఈ విషయంలో అమెరికా వైఖరిని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ దురాక్రమణ నేపథ్యంలో రష్యా, ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా, యూరప్ దేశాలు కఠినమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశాల పేర్లు ఎత్తకుండా ఆమె కొన్ని హెచ్చరికలు చేశారు. ‘‘కొన్ని దేశాలు ఈ విషయంలో గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నాయి. రష్యాతో తమ బంధాలను కాపాడుకోవడం ద్వారా లాభాలు పొందాలని వాటి ఆలోచనలా ఉంది. కానీ ఈ నిర్ణయాలు చాలా కుంచిత బుద్ధితో తీసుకునేవి. భవిష్యత్తులో వీటి పరిణామాలు చాలా కఠినంగా ఉంటాయి’’ అని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలు, శాంతిభద్రతలు, ఆర్థిక అభివృద్ధికి ప్రస్తుత పరిస్థితులు సవాళ్లు విసురుతున్నాయని యెలెన్ అన్నారు. ఇలాంటి సమయంలో రష్యాకు వ్యతిరేకంగా తాము విధించిన ఆంక్షలను తక్కువ చేసే చర్యలను అంత సులభంగా తీసుకోబోమని, తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోళ్లు నిలిపివేయాలని, లేదంటే ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా నిర్ణయాలకు విఘాతం కలుగుతుందని ఇటీవలే యూఎస్ అధ్యక్షుడు జోబైడెన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యెలెన్ వ్యాఖ్యలు కూడా భారత్‌ను ఉద్దేశించే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.