న్యూఢిల్లీ : భారత సీనియర్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ షమీ పునరాగమనంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తిరిగి జట్టులోకి రాలేకపోయిన షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరఫున రంజీల్లో ఆడుతున్నాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన షమీ 15.53 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. స్వదేశం వేదికగా త్వరలో దక్షిణాఫ్రికాతో మొదలయ్యే రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో షమీకి చోటు లభించలేదు. ఓవైపు తన ఫిట్నెస్ను నిరూపించుకుంటూ 35 ఏండ్ల షమీ రంజీల్లో వికెట్ల వేట కొనసాగిస్తున్నా..జాతీయ సెలెక్టర్ల నమ్మకాన్ని మాత్రం చూరగొనలేకపోతున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా కాలి మడమ గాయానికి గురైన షమీ చాలా రోజుల పాటు జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో కూడా ఆడలేకపోయాడు.
మార్చిలో జరిగిన దుబాయ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ నాటికి అందుబాటులోకి వచ్చిన షమీ..ఎడారి నగరంలో పిచ్‌లపై అంతగా ప్రభావం చూపించలేకపోయాడు. 12 ఏండ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని ముద్దాడిన టీమ్ఇండియాలో సభ్యుడిగా ఉన్న షమీకి మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ సీనియర్ పేసర్ గైర్హాజరీలో ఓవైపు టెస్టుల్లో ఆకాశ్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి యువ బౌలర్లు అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన పరిణామాలు షమీ రీఎంట్రీ ఆలస్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత మునుపటి తరహాలో వేగంగా బౌలింగ్ చేయలేకపోతున్న ఈ బెంగాల్ స్పీడ్‌స్టర్ మ్యాచ్ ఫిట్నెస్ విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్లో బెంగాల్‌కు ఆడుతున్న షమీ వికెట్లు తీస్తున్నా.. విరామం లేకుండా బౌలింగ్ వేయలేకపోతున్నాడు. నాలుగు ఓవర్లు వేసి బ్రేక్ తీసుకుంటున్న షమీకి ఫిట్నెస్ సమస్య ప్రతిబంధకంగా మారింది.
ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులకు ముందు షమీని పరిశీలించాలనుకున్న బీసీసీఐ సెలెక్టర్లు ఇంగ్లండ్ లయన్స్‌తో సన్నాహక మ్యాచ్‌లు ఆడమన్నట్లు తెలిసింది. ‘ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహక మ్యాచ్ ద్వారా షమీ స్థానంపై ఓ అంచనాకు రావాలనుకున్నాం. ఇందుకోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సభ్యులతో పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్లు షమీని నిరంతరాయంగా సంప్రదించారు. కానీ అతని వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అప్పటికే సిరీస్‌లో బుమ్రా పూర్తి స్థాయిలో ఆడలేడన్న విషయం తెలిసిన తర్వాత షమీ వైపు మొగ్గుచూపాలనుకున్నాం. కానీ నిరాశే ఎదురైంది. మ్యాచ్ ఫిట్నెస్ కోసం మరింత సమయం కావాలని షమీ తెలుపడంతో మిగతా బౌలర్ల వైపు దృష్టి సారించాం. షమీతో ఎలాంటి చర్చ జరుగలేదనేది అబద్దం. టెస్టులకు అతని ఫిట్నెస్ సరిపోతుందా అన్న దానిపై స్పోర్ట్స్ సైన్స్ టీమ్‌తో పాటు మెడికల్ రిపోర్ట్‌లను పరిగణనలోకి తీసుకున్నాం. కఠినమైన అంతర్జాతీయ క్రికెట్‌కు అతని శరీరం సహకరిస్తుందా అనేది ఆలోచించాం’ అని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు.