T20 World Cup | గయానా: తొలిసారిగా 20 జట్లతో ఆడుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా.. ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో రాణించి అన్నింటి కంటే చివరగా అర్హత సాధించిన ఉగాండా.. ఈ మెగా టోర్నీలో సంచలనం సృష్టించింది. మొదటి సారి పొట్టి ప్రపంచకప్ ఆడుతున్న ఆ జట్టు.. గురువారం గయానా వేదికగా పపువా న్యూగినీ (పీఎన్జీ)తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది.
43 ఏండ్ల ఆఫ్ స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగ.. (4-2-4-2) సంచలన స్పెల్‌తో పాటు భారత సంతతి ఆటగాడు అల్పేశ్ రంజానీ (2/17), జుమ మియాగి (2/10) బంతితో మాయ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పీఎన్జీ 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌట్ అయింది. హిరి హిరి (15) టాప్ స్కోరర్. లక్ష్య ఛేదనలో ఉగాండా సైతం తడబడింది. 6 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయినా.. సహచరుల అండతో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రియాజత్ అలీ షా (56 బంతుల్లో 33, 1 ఫోర్) పోరాటానికి తోడు మియాగి (13) రాణించి ఉంగాండాకు చారిత్రక విజయాన్ని అందించారు.