బ్యాంకాక్ : ఏషియన్ బాక్సింగ్ అండర్-22 చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్లు భావనశర్మ, యాత్రి పటేల్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల 48కిలోల క్వార్టర్స్‌లో భావన..నోగ్ లిన్హ్ చీ నో(వియత్నాం)పై అలవోక విజయం సాధించింది.
బౌట్లో ఆది నుంచే తనదైన జోరు ప్రదర్శించిన భావన మూడు రౌండ్లలో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు 57కిలోల క్వార్టర్స్‌లో యాత్రి పటేల్..కీర్తన ఉతయకుమార్(శ్రీలంక)పై గెలిచి ముందంజ వేసింది. పురుషుల, మహిళల విభాగాలుగా సాగుతున్న ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి మొత్తం 40 బాక్సర్లు బరిలో ఉన్నారు. దేశవాళీ టోర్నీలో సత్తాచాటిన భారత యువ బాక్సర్లు ఆసియా టోర్నీలోనూ అదరగొడుతున్నారు.