World Sight Day 2025 | మానవ శరీరంలో ప్రతి అవయవానికీ ప్రత్యేక స్థానం ఉంది. అయినప్పటికీ కళ్లకు మరింత ప్రాముఖ్యం ఉంది. కళ్లు మనకు అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తాయి. చదవడం, ప్రపంచాన్ని చూడడం, ప్రకృతిని ఆస్వాదించడంలో కళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. అయితే కళ్లు అనేక విధాలుగా ప్రమాదంలో ఉన్నాయి. దినచర్య, ఆహారపు అలవాట్లు, మొబైల్, ల్యాప్‌టాప్ వంటి స్క్రీన్లపై ఎక్కువగా సమయం గడుపుతుండడంతో కళ్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న లక్షలాది మంది పిల్లలు కూడా స్పష్టంగా చూడలేకపోతున్నారు. వారంతా చిన్న వయసులోనే అద్దాలను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.2 బిలియన్ల మంది ప్రజలు ఏదో ఒక రకమైన కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఈ కేసుల్లో సగానికి పైగా సరైన సంరక్షణ, ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలలో, యువకులో కండ్లు పొడిబారడం సర్వసాధారణంగా ఉంది. కొన్ని అలవాట్లను మెరుగుపరచుకోవడంతో ప్రమాదం తగ్గించే అవకాశం ఉంది. జీవనశైలికి సంబంధించిన అనేక అంశాలు కంటి సమస్యలకు కారణమవుతాయని, వీటిని చిన్న వయస్సు నుంచే తీవ్రంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డిజిటల్ స్క్రీన్లను నిరంతరం ఉపయోగించడం, పోషకాహార లోపం, జంక్ ఫుడ్ వినియోగం, నిద్ర లేకపోవడం, కాలుష్యం, దుమ్ము ధూళి ప్రధాన కారణాలుగా పరిగణిస్తారు. అయితే, కండ్లకు హాని కలిగించే ఒక ప్రమాదకరమైన అలవాటు చాలా అరుదుగా గుర్తిస్తారు.
చక్కెర, తీపి పదార్థాలు అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల మధుమేహం పెరగడమే కాకుండా కంటి సమస్యలు కూడా పెరుగుతాయి. అధిక చక్కెర తీసుకోవడం వల్ల డయాబెటిక్ రెటినోపతి, అస్పష్టమైన దృష్టి, అకాల కంటిశుక్లం వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాల్లో నిపుణులు గుర్తించారు. ఎక్కువ చక్కెర, స్వీట్ పానీయాలు తీసుకోవడం వల్ల కాలక్రమేణా డయాబెటిక్ రెటినోపతి ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రెటీనా నరాలను ప్రభావితం చేస్తుంది. సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే, అది క్రమంగా అంధత్వానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అధిక చక్కెర వినియోగం కంటి లెన్స్‌ను కూడా ప్రభావితం చేస్తుందని.. ఇది కంటిశుక్లం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
అధిక చక్కెర ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను కూడా వేగంగా పెంచుతుందని అధ్యయనాల్లో తేలింది. దీర్ఘకాలికంగా హై షుగర్ లెవల్స్ మీ కంటిలోని లెన్స్ వాపు ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది దాని ఆకారాన్ని మారుస్తుంది. దాంతో సరిగ్గా దృష్టి పెట్టడం కష్టతరం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ఈ సమస్య తగ్గుతుంది. చక్కెర అధికంగా ఉండే ఆహారం, అధిక రక్తంలో చక్కెర కలయిక కన్నీటి ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో కళ్ళు పొడిబారడం, కంటి చికాకు, జలదరింపు, దృష్టి మసకబారడం తదితర లక్షణాలు కనిపిస్తాయి.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీలోని ఒక నివేదిక ప్రకారం.. తరచుగా అధికంగా చక్కెర తీసుకునే వ్యక్తుల్లో కంటి సంబంధిత వ్యాధుల బారినపడే ప్రమాదం 30శాతం ఉంది. పిల్లలు, యువకులు శీతల పానీయాలు, స్వీట్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, చాక్లెట్ వినియోగాన్ని తగ్గించి, పండ్లు వంటి సహజ తీపి ఉండే వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఇ, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ఆహారంలో చక్కెరను తగ్గించి.. ఈ పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాల తీసుకోవడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.