కొలంబో: మహిళల ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదుచేసింది. కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కంగారూలు 107 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తుచేశారు. మొదట బ్యాటింగ్‌లో స్టార్ బ్యాటర్లంతా తడబాటుకు గురైనా బెత్ మూనీ (114 బంతుల్లో 109, 11 ఫోర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి శతకంతో ఆసీసీను ఆదుకుంది. ఆమెతో పాటు పదో వరుస బ్యాటర్ అలానా కింగ్ (49 బంతుల్లో 51*, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధ శతకంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 రన్స్ చేసింది. పాక్ స్పిన్నర్లు రాణించడంతో ఒక దశలో ఆసీస్ 76/7గా నిలిచింది.
ఈ దశలో కంగారూలు 150 పరుగులైనా చేయగలరా? అనిపించింది. స్పిన్‌ను అనుకూలించిన కొలంబో పిచ్‌పై పాక్ స్పిన్నర్లు నష్రా సంధు (3/37), రమీన్ షమీమ్ (2/29), సదియా (1/32) ప్రత్యర్థి బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. కానీ కిమ్‌గార్త్ (11) అండతో మూనీ ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ఈ ఇద్దరూ 8వ వికెట్‌కు 39 రన్స్ జోడించారు. గార్త్ నిష్క్రమించినా ఆమె స్థానంలో వచ్చిన అలానాతో కలిసి మూనీ ఆసీస్‌కు భారీ స్కోరును అందించింది. ఈ ఇద్దరూ పదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 106 రన్స్ జోడించారు. మూనీకి వన్డేల్లో ఇది ఐదో శతకం.
పేకమేడలా కూలిన పాక్..
ఛేదనలో పాక్ ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ 36.3 ఓవర్లలో 114 రన్స్‌కే కుప్పకూలింది. సిద్ర అమిన్ (35) టాప్ స్కోరర్ కాగా ఆమె తర్వాత రెండంకెల స్కోరు చేసింది లోయరార్డర్ బ్యాటర్లే కావడం గమనార్హం. కిమ్ గార్త్ (3/14), సదర్లండ్ (2/15) మేగన్ (2/25) పాక్ పనిపట్టగా గార్డ్నర్, కింగ్, వేర్హమ్ తలా ఒక వికెట్ తీశారు. ఈ టోర్నీలో పాక్‌కు ఇది హ్యాట్రిక్ ఓటమి. ఇక ఈ విజయంతో ఐదు పాయింట్లు సాధించిన ఆసీస్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
సంక్షిప్త స్కోర్లు:
ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో 221/9 (మూనీ 109, అలానా 51*, సంధు 3/37, షమీమ్ 2/29); పాకిస్థాన్: 36.3 ఓవర్లలో 114 (అమిన్ 35, షమీమ్ 15, గార్త్ 3/14, సదర్లండ్ 2/15)