ఇండోర్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు గాను ఇండోర్‌కు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లపై ఓ ఆకతాయి లైంగిక వేధింపులకు పాల్పడటమే గాక ఒక క్రీడాకారిణిని అసభ్యకరంగా తాకుతూ వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇండోర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియా జట్టులోని ఇద్దరు క్రికెటర్లు గురువారం ఉదయం వారు బస చేసిన రాడిసన్ బ్లూ హోటల్ నుంచి పక్కనే ఉన్న కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి బైక్‌పై వచ్చి వారిని వెంబడించాడు.
చేతి వేళ్లతో అభ్యంతకరమైన సైగలు చేస్తూ వారిని లైంగికంగా వేధించాడు. అంతేగాక ఒక క్రికెటర్‌ను అసభ్యకరంగా తాకాడు. దీంతో వాళ్లు టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్ డానీ సిమన్స్కు ఎమర్జెన్సీ మెసేజ్ పంపి తమ లొకేషన్‌ను షేర్ చేశారు. వెంటనే అప్రమత్తమైన సిమన్స్ బృందం ఘటనాస్థలికి వెళ్లి వారిని భద్రంగా హోటల్‌కు తీసుకొచ్చింది. అనంతరం సిమన్స్ స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లు రంగంలోకి దిగారు.
బైక్ నెంబర్ ద్వారా అనుమానితుడిని గుర్తించిన పోలీసులు.. స్థానికంగా ఉన్న ఐదు పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంతో నిందితుడిని ఆరు గంటల్లోనే పట్టుకున్నారు. నిందితుడిని ఖజ్రానాకు చెందిన అకీల్ ఖాన్‌గా గుర్తించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా విచారం వ్యక్తం చేస్తూ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు క్షమాపణలు చెప్పాడు. ఇటువంటి ఘటనలు దేశ గౌరవాన్ని దెబ్బతీస్తాయన్న ఆయన నిందితుడిని వేగంగా పట్టుకున్న పోలీసులను అభినందించాడు. ఇదిలాఉండగా తాజా ఘటన మధ్యప్రదేశ్‌లో రాజకీయ దుమారాన్ని రేపింది. ఆతిథ్య రంగంలో అగ్రగామిగా ఉన్న ఇండోర్‌లో బీజేపీ శాంతి భద్రతలను గాలికొదిలేసిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది.