Travis Head : విధ్వంసక ఇన్నింగ్స్‌లతో రికార్డులు తిరగరాస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ (Travis Head) రెండోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య జెస్సికా డేవీస్ (Jessica Davies) ఈమధ్యే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో, ట్రావిస్ దంపతులు పట్టలేనంత సంబురాల్లో మునిగిపోయారు. తమ చిన్నోడికి వీళ్లు హ్యారిసన్ జార్జ్ హెడ్ (Harisson George Head) అని పేరు పెట్టారు. ఈ సంతోషకరమైన విషయాన్ని హెడ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
భార్య జెస్సికా పక్కనే నిల్చొని.. బాబును, కూతురు మిల్లాను ఎత్తుకొని ఉన్న ఫొటోను ఈ చిచ్చరపిడుగు పోస్ట్ చేశాడు. దాంతో, ఆ ఫొటో చూసిన ఆసీస్ ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ హెడ్ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఐపీఎల్లో హెడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం రెండోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది.
ఆస్ట్రేలియాకు మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడైన హెడ్ ప్రస్తుతం పితృత్వ సెలవుల్లో ఉన్నాడు. అందుకనే అతడు పాకిస్థాన్‌తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. మరో 11 రోజుల్లో భారత జట్టుతో జరుగబోయే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో హెడ్ మళ్లీ బరిలోకి దిగనున్నాడు.
పదిహేడో సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన హెడ్ సుడిగాలిలా చెలరేగాడు. మెరుపు ఇన్నింగ్స్‌లతో రికార్డులు బద్ధలు కొట్టేసిన హెడ్ ఈసారి కూడా ఆరెంజ్ ఆర్మీకి ఆడనున్నాడు. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.14 కోట్లకు అట్టిపెట్టుకుంది. నిరుడు మినీ వేలంలో హైదరాబాద్ యాజమాన్యం అతడిని రూ.4 కోట్లకే కొన్నది. కానీ, ఓపెనర్ అతడి దూకుడు.. మెరుపు బ్యాటింగ్ విన్యాసాలు చూశాక.. ఇక వదులుకోవద్దనే ఉద్దేశంతో ఏకంగా రూ. 10 కోట్లు అదనంగా చెల్లించేందుకు కావ్యా మారన్ బృందం సిద్దమైంది.
A baby boy for Travis & Jess! 👶
The Orange Army just got a new fan. 🧡🥰 pic.twitter.com/7bIt6xvruH
— SunRisers Hyderabad (@SunRisers) November 8, 2024