Asia Cup 2025 : ఆసియా కప్ పోటీలకు భారత స్క్వాడ్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓపెనింగ్ నుంచి మిడిలార్డర్, బౌలింగ్ యూనిట్ వరకూ ఎవరిని తీసుకోవాలి? అనే అంశంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ మెగా టోర్నీకి సమతూకంతో కూడిన బృందం ఎంపిక ఇరువురికి సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ (Suraykumar Yadav) ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయ్యాడు. మరోవైపు.. ఇంగ్లండ్ పర్యటనలో మూడే టెస్టులే ఆడిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సైతం తాను అందుబాటులో ఉన్నానని సెలెక్టర్లకు సమాచారమిచ్చాడు. దాంతో, ఆసియా కప్ స్క్వాడ్‌లో ఈ ఇద్దరూ ఉండడం ఖాయమనిపిస్తోంది.
ఆసియా కప్ సమీపిస్తున్నందున భారత సెలెక్టర్లు ఆగస్టు 19న ముంబైలో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్‌లో స్క్వాడ్ ఎంపికపై స్పష్టత రానుంది. ఆసియా కప్ సెలెక్షన్స్‌కు తాను అందుబాటులో ఉన్నానని బుమ్రా సెలెక్టర్లకు చెప్పాడు. స్క్వాడ్‌లో చోటు కోసం ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ ఉంది.
జస్ప్రీత్ బుమ్రా
అయితే.. బృందంలో ఎవరెవరు ఉండాలి? అనే విషయమై సెలెక్టర్లు వచ్చే వారం సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు అని బీసీసీఐ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ టోర్నీని టీ20 పార్మాట్లో నిర్వహిస్తున్నారు. ఈ మెగా ఈవెంట్లో చిరకాల ప్రత్యర్థులు సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా తలపడనున్నాయి.
పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వీడ్కోలు పలకడంతో టాపార్డర్ కోసం గట్టి పోటీ నెలకొంది. ముఖ్యంగా ఓపెనర్ స్థానం కోసం యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మలు బరిలో ఉన్నారు. ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన గిల్‌కే కెప్టెన్సీ అందించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
Check out our predicted India XI for the Asia Cup 2025! 🇮🇳🏏 🏆
Share your XI in the comments below! 👇#India #SuryakumarYadav #T20Is #Sportskeeda pic.twitter.com/Xq2b6Q24HM
— Sportskeeda (@Sportskeeda) August 16, 2025
అయితే.. స్పోర్ట్స్ హెర్నియా గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ పరీక్షలో పాస్ కావడంతో అతడికే సారథ్యం అప్పగించే అవకాశాలున్నాయి. ఎన్సీఏలో రాటుదేలుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఫిట్నెస్ చాటుకోవాల్సి ఉంది. రెండో వికెట్ కీపర్ కోసం ఇషాన్ కిషన్, జితేశ్ శర్మలు పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని సంజూకు బ్యాకప్‌గా సెలెక్ట్ చేసే అవకాశముంది.