e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home స్పోర్ట్స్ ఆశ.. నిరాశ

ఆశ.. నిరాశ

  • మూడో రోజూ ఆకట్టుకోని భారత అథ్లెట్లు
  • మనిక, నాగల్‌, సజన్‌, భవానీ పరాజయం
  • శరత్‌ ముందంజ..

విశ్వక్రీడల్లో వరుసగా రెండో రోజు భారత అథ్లెట్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజతం పట్టడంతో టోక్యో ఒలింపిక్స్‌ను ఘనంగా
ఆరంభించిన భారత్‌.. ఇప్పటి వరకు ఆ ఒక్క మెడల్‌తోనే సంతృప్తి పడాల్సి వస్తున్నది. బాక్సింగ్‌, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌ ఇలా పతకాలు సాధించే అవకాశాలు ఉన్న క్రీడల్లోనూ మనవాళ్లు నిరాశపరుస్తున్నారు. విలువిద్యలో భారత పురుషుల జట్టు కొరియా గండాన్ని దాటలేకపోతే.. ఫెన్సింగ్‌లో ఆరంభ మెరుపులు నమోదైనా.. తుది ఫలితం మాత్రం నిరాశ కలిగించింది. టెన్నిస్‌లో సుమీత్‌ నాగల్‌, టేబుల్‌ టెన్నిస్‌లో మనికా బాత్రా, స్విమ్మింగ్‌లో సజన్‌ ప్రకాశ్‌, బాక్సింగ్‌లో ఆశిష్‌, బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ పరాజయం పాలయ్యారు.

టోక్యో: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు వరుసగా రెండో రోజూ నిరాశ పరిచారు. పతకం సాధించడం పక్కా అనుకున్నవాళ్లు పేలవ ప్రదర్శన చేయగా.. అంచనాలు లేని వాళ్లు అనూహ్య విజయాలు సాధించినా.. చివరివరకు వాటిని కొనసాగించడంలో విఫలమయ్యారు. పురుషుల ఆర్చరీ జట్టు ప్రభావం చూపలేకపోగా.. మహిళల హాకీ జట్టు 0-2తో జర్మనీ చేతిలో ఓడింది. టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) సింగిల్స్‌లో శరత్‌ మూడో రౌండ్‌కు చేరడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం కాగా.. మంగళవారం షూటింగ్‌, సెయిలింగ్‌, బాక్సిం గ్‌, టేబుల్‌ టెన్నిస్‌లో మనవాళ్లు బరిలోకి దిగనున్నారు.

కమల్‌ కమాల్‌..

- Advertisement -

సీనియర్‌ టీటీ ప్లేయర్‌ శరత్‌ కమల్‌ రెండో రౌండ్‌లో చక్కటి విజయాన్నందుకున్నాడు. సోమవారం జరిగిన పోరులో 39 ఏండ్ల శరత్‌ 4-2 (2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9)తో టియాగో పొలోనియా (పోర్చుగల్‌)పై గెలుపొందాడు. 49 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ కోల్పోయిన అనంతరం శరత్‌ విజృంభించి ఆడాడు. మహిళల సింగిల్స్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. పతక ఆశలు రేపిన మనికా బాత్రా మూడో రౌండ్‌లో ఓటమి పాలవగా.. సుతీర్థ ముఖర్జీ రెండో రౌండ్‌లోనే ఇంటి బాటపట్టింది.
భళా భవానీ..
విశ్వక్రీడల బరిలోకి దిగిన తొలి భారత ఫెన్సర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన భవానీ దేవి.. తొలి రౌండ్‌లో విజయం సాధించి భేష్‌ అనిపించుకుంది. సోమవారం మొదటి రౌండ్‌లో భవానీ దేవి 15-3తో నదియా బెన్‌ అజీజి (ట్యునీషియా)పై గెలిచింది. ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే రెండో రౌండ్‌లో భవానీ దేవి 7-15తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ మానాన్‌ బ్రూనెట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడింది.

సాత్విక్‌ జోడీ ఓటమి

బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి రెండో రౌండ్‌లో పరాజయం పాలైంది. సోమవారం జరిగిన పోరులో సాత్విక్‌ జంట 13-21, 12-21తో ప్రపంచ నంబర్‌వన్‌ మార్కస్‌ ఫెర్నాల్డీ-కెవిన్‌ సంజయ ద్వయం (ఇండోనేషియా) చేతిలో ఓడింది.

నాగల్‌కు నిరాశ

భారత టెన్నిస్‌ ఆటగాడు సుమీత్‌ నాగల్‌ 2-6, 1-6తో మెద్వెదెవ్‌ చేతిలో ఓడాడు. 66 నిమిషాల్లో ముగిసిన పోరులో 160వ ర్యాంకర్‌ నాగల్‌కు మెద్వెదెవ్‌ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

ఆశిష్‌ ఇంటిదారి..

భారత బాక్సర్‌ ఆశిష్‌ చౌదరి (75 కేజీలు) పోరాటం ముగిసింది. తొలిసారి విశ్వక్రీడల బరిలోకి దిగిన ఆశిష్‌ ఎర్బికే తౌహెటా (చైనా) చేతిలో ఓడాడు.

కొరియా గండం దాటలేక..

ఆర్చరీ పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో భారత త్రయం ఓటమి పాలైంది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కొరియా చేతిలో ఓడిన భారత్‌.. పురుషుల టీమ్‌ ఈవెంట్‌లోనూ కొరియా గండాన్ని దాటలేకపోయింది. అతాను దాస్‌, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌తో కూడిన భారత జట్టు ప్రిక్వార్టర్స్‌లో 6-2తో కజకిస్థాన్‌పై విజయం సాధించినా.. క్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ కొరియా చేతిలో 0-6తో ఓటమి పాలైంది.

సజన్‌ పరాజయం

స్విమ్మింగ్‌ 200 మీటర్ల పురుషుల బటర్‌ఫ్లై విభాగంలో 1 నిమిషం 57.22 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన సజన్‌ ప్రకాశ్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.

గురి తప్పింది

భారత షూటర్ల గురి మరోసారి తప్పింది. సోమవారం జరిగిన పురుషుల స్కీట్‌ ఈవెంట్‌లో అంగద్‌వీర్‌ సింగ్‌ 18వ స్థానంతో సరిపెట్టుకోగా.. మీరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ 25వ ప్లేస్‌లో నిలిచాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana