హైదరాబాద్‌లో దసరా ధమాకాకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 పోరుకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ఇండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేస్తే..కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లా ఆరాటపడుతున్నది.
పొట్టిపోరులో అవకాశాలను అందిపుచ్చుకుంటూ కుర్రాళ్లు కేక పుట్టిస్తున్న వేళ రిజర్వ్ బెంచ్‌ను రంగంలోకి దింపేందుకు టీమ్ మేనేజ్మెంట్ పావులు కదుపుతున్నది. ఢిల్లీ టీ20లో దుమ్మురేపిన నితీశ్‌రెడ్డి సొంతగడ్డపై సత్తాచాటాలన్న కసితో ఉన్నాడు. టీమ్ఇండియాకు కనీస పోటీనిచ్చేందుకు బంగ్లా పట్టుదలతో ఉన్నది. శనివారం జరిగే మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కల్గించనుందన్న వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 పోరుకు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం అన్ని హంగులతో సిద్ధమైంది. దసరా పర్వదినమైన శనివారం ఇరు జట్ల మధ్య ఆసక్తికపోరు జరుగనుంది. గ్వాలియర్, ఢిల్లీ విజయాలతో మంచి ఊపుమీదున్న టీమ్ఇండియా..హైదరాబాద్‌లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలని చూస్తున్నది. పరుగుల వరద పారే ఉప్పల్ పిచ్‌పై ఎవరిది ఆధిపత్యమో మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం శనివారం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించే అవకాశాలు ఉన్నాయి.
సొంతగడ్డపై తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు భారత్ మరోమారు సిద్ధమైంది. ప్రత్యర్థి ఎవరైనా సిరీస్ మన ఖాతాలో చేరాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకెళుతున్నది. ఇప్పటికే సిరీస్ దక్కించుకున్న టీమ్ఇండియా..మూడో పోరుకు మార్పులు, చేర్పులు చేసే చాన్స్ ఉంది. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుడుతున్న శాంసన్ స్థానంలో జితేశ్‌శర్మను, వరుణ్ చక్రవర్తికి బదులు రవి బిష్ణోయ్‌ను, మయాంక్ స్థానంలో హర్షిత్రానాను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ టీ20లో అదరగొట్టిన తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్..సొంత ఇలాఖాలో సత్తాచాటాలన్న పట్టుదలతో ఉన్నాడు.
సిరీస్‌లో భారత్‌కు కనీసం పోటీనివ్వలేకపోతున్న బంగ్లా కనీసం పరువైనా దక్కించుకోవాలని చూస్తున్నది. టెస్టు సిరీస్‌తో పాటు టీ20ల్లో వరుస ఓటములతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన బంగ్లా..చివరి పోరులో రాణించేందుకు సర్వశక్తులు ఒడ్డనుంది. బంగ్లా తరఫున మహ్మదుల్లా తన ఆఖరి టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు.