పల్లెకెలె (శ్రీలంక): లంక పర్యటనలో తొలి రెండు టీ20లు గెలిచి జోరు మీదున్న యువ భారత జట్టు మంగళవారం నామమాత్రమైన మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కొత్త కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో అన్ని విభాగాల్లోనూ అదరగొడుతున్న భారత్.. అంతగా అనుభవం లేని లంకేయులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బ్యాటింగ్‌లో యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా దూకుడుగా పరుగులు రాబడుతుండగా బౌలర్లలో రవి బిష్ణోయ్ గత రెండు మ్యాచ్‌లలోనూ కీలకంగా మారాడు. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిన శ్రీలంక ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆశిస్తోంది.