తిరువనంతపురం: శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై భారత మహిళల జట్టు గురిపెట్టింది. సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ దక్కించుకోవాలని చూస్తున్నది.
శుక్రవారం ఇరు జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 పోరు జరుగనుంది. కొట్టిన పిండిల్లాంటి స్వదేశీ పిచ్‌లపై భారత్ వరుస విజయాల జోరు మీద కనిపిస్తుంటే, లంక కనీసం పరువైనా నిలుపుకోవాలని చూస్తున్నది. ఇటీవల ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ గెలిచి మంచి జోరుమీదున్న కౌర్‌సేన..పొట్టి ఫార్మాట్లోనూ అదరగొట్టాలని పట్టుదలతో ఉంది. యువ బ్యాటర్లు షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ సూపర్ ఫామ్ మీదున్నారు. మరోవైపు కిందటేడాది భారత్‌పై చివరిసారి గెలిచిన లంక..సిరీస్‌లో పుంజుకోవాలని చూస్తున్నది.