న్యూఢిల్లీ: దేశవాళీ సీజన్లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి రంజీ ట్రోఫీకి తెరలేవనుంది. మొత్తం 32 జట్లు ఎనిమిదేసి జట్లతోనాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. జాతీయ జట్టులో తిరిగి చోటు కోసం ఆశిస్తున్న శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అజింక్యా రహానే లాంటి క్రికెటర్లు తమ అదృషాన్ని పరీక్షించుకోనున్నారు. గత రంజీ సీజన్లో ఆడకుండా నేరుగా ఐపీఎల్ ఆడి బీసీసీఐ పెద్దల ఆగ్రహానికి గురైన అయ్యర్, ఇషాన్..ఈసారి తమ తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
నిబంధనలు ఎవరికైనా ఒకటేనన్న బోర్డు పెద్దల ఆదేశాలతో అయ్యర్, ఇషాన్ దిగిరాక తప్పలేదు. అయ్యర్, రహానే, పృథ్వీషా లాంటి క్రికెటర్లతో డిఫెండింగ్ చాంప్ ముంబై పటిష్ఠంగా కనిపిస్తున్నది. ఖాన్ బ్రదర్స్(సర్ఫరాజ్, ముషీర్) కూడా చేరితే ముంబైకి తిరుగుండకపోవచ్చు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే..తమ తొలి పోరులో గుజరాత్‌తో తలపడనుంది. గత సీజన్లో ప్లేట్ డివిజన్ విన్నర్‌గా నిలిచిన హైదరాబాద్..ఈసారి ఎలైట్‌లో సత్తాచాటాలని చూస్తున్నది. స్థానిక జింఖానా మైదానంలో ఇరు జట్లు తలపడనున్నాయి.