న్యూఢిల్లీ: గజ్జల్లో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ(Tilak Varma) సర్జరీ చేయించుకున్నాడు. దీని వల్ల అతను కివీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక టీ20 వరల్డ్‌కప్‌లోనూ అతను ఆరంభ మ్యాచ్‌లకు దూరం అయ్యే ఛాన్సు ఉన్నది. హైదరాబాద్ తరపున రాజ్‌కోట్‌లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న సమయంలో ఇండియన్ బ్యాటర్ తిలక్ వర్మకు గాయమైంది. అయితే నొప్పి తీవ్రంగా ఉన్నట్లు ఫిర్యాదు చేయడంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. గజ్జల్లో నొప్పి ఉన్నట్లు తిలక్ ఫిర్యాదు చేశాడని, అతన్ని గోకుల్ ఆస్పత్రికి తరలించామని, స్కానింగ్ ద్వారా కణజాలం చీలినట్లు గుర్తించామని, అందుకే తక్షణమే సర్జరీ చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
స్పెషలిస్టు అభిప్రాయం తీసుకున్న తర్వాత సర్జరీకి వెళ్లినట్లు బీసీసీఐ అధికారి చెప్పారు. సర్జరీ సక్సెస్ అయ్యిందని, ప్రస్తుతం అతను బాగానే ఉన్నట్లు తెలిపారు. అయితే రికవరీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటామన్నారు. సర్జరీ వల్ల తిలక్ వర్మ కివీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. జనవరి 21వ తేదీ నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సరీస్ ప్రారంభంకానున్నది. ఆ తర్వాత జరిగే టీ20 వరల్డ్‌కప్ ప్రారంభ మ్యాచ్‌లకు కూడా అతను మిస్సయ్యే అవకాశాలు ఉన్నాయి.