IND vs SA 3rd T20 : దక్షిణాఫ్రికా గడ్డపై సంజూ శాంసన్ మెరుపు సెంచరీని మరువకముందే మరో భారత కుర్రాడు శతక గర్జన చేశాడు. సిరీస్‌లో ముందంజ వేయాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(107 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. సెంచూరియన్‌లో బౌండరీల వర్షం కురిపిస్తూ టీ20ల్లో తొలి సెంచరీతో చెలరేగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించి జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ(50) సైతం చితక్కొట్టగా.. టీమిండియా ప్రత్యర్థికి 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
మూడో టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ మర్క్రమ్ బౌలింగ్ తీసుకున్నాడు. అతడి నిర్ణయం సరేందే అని చాటుతూ మార్కో జాన్సెన్ తొలి ఓవర్లోనే డేంజరస్ సంజూ శాంసన్(0)ను బౌల్డ్ చేశాడు. 3 బంతులాడిన శాంసన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో, పరుగుల ఖాతా తెరవకముందే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది, అయితే.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(107 నాటౌట్), అభిషేక్ శర్మ(50)లు దంచేశారు. సఫారీ పేసర్లపై ఎదురుదాడికి దిగితూ స్క్వేర్ దిశగా బౌండరీల మోత మోగించారు. దాంతో, భారత జట్టు స్కోర్ పవర్ ప్లేలోనే 70 దాటేసింది.
కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన అభిషేక్.. సింగిల్ తీసి హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో వికెట్‌కు 107 పరుగులు కలిపిన ఈ జోడీని మహరాజ్ విడదీశాడు. క్రీజు వదిలి ముందుకొచ్చిన అభిషేక్‌ను క్లాసెన్ స్టంపౌట్ చేశాడు. ఆ కాసేపటికే సూర్యకుమార్ యాదవ్(1), హార్దిక్ పాండ్యా(18)లు ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. అయినా సరే రింకూ సింగ్(8) జతగా తిలక్ ఇన్నింగ్స్ నిర్మించాడు. సిపలమ్ వేసిన 19వ ఓవర్లో బౌండరీతో తిలక్ తొలి టీ20 శతకం సాధించాడు. ఆఖరి ఓవర్లో 4 పరగులు రావడంతో భారత జట్టు సఫారీలకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.