ముంబై: హైదరాబాద్ యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్‌వర్మ రికార్డులు దాసోహం అవుతున్నాయి. టీ20ల్లో దుమ్మురేపుతున్న వర్మ.. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. దక్షిణాఫ్రికాతో రెండు సెంచరీల జోరును కొనసాగిస్తూ శనివారం మేఘాలయతో మ్యాచ్‌లోనూ వర్మ(67 బంతుల్లో 151, 14ఫోర్లు, 10సిక్స్‌లు) విజృంభించాడు. ఈ క్రమంలో టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. దీనికి తోడు పొట్టి ఫార్మాట్లో 150 పరుగుల మార్క్ అందుకున్న మొదటి క్రికెటర్‌గాను ఘనత సాధించాడు. తిలక్‌కు తోడు తన్మయ్(55) రాణించడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 248/4 స్కోరు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో అనికేత్‌రెడ్డి, తనయ్ ధాటికి మేఘాలయ 15.1 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. దీంతో హైదరాబాద్ 179 పరుగుల తేడాతో గెలిచింది.