ICC : అమెరికాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణతో భారీ నష్టం మూటగట్టుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. అనుకున్న బడ్జెట్ కంటే రూ. 100 కోట్లు అదనపు ఖర్చుపై సమీక్ష కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రోజర్ ట్వొసే(Roger Twose) , కామెంటేటర్ లాసన్ నాయుడు(Laws0n Naidoo), ఐసీసీ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ ఖవాజా(Imran Khawaja)లతో కూడిన కమిటీని సోమవారం ఐసీసీ నియమించింది.
అమెరికాలో వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణ, టికెట్ల అమ్మకాలు, టోర్నీ జరపడంలో అవకతవకలు వంటి విషయాలపై ఈ ముగ్గురు అధ్యయనం చేయనున్నారు. పొట్టి ప్రపంచకప్ పోటీలను ఐసీసీ తొలిసారి అమెరికాలో నిర్వహించింది.

న్యూయార్క్, డల్లాస్, ఫ్లోరిడాలో మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల అదనంగా రూ.100 కోట్ల(20 మిలియన్ల డాలర్లు) ఖర్చు కావడంతో అమెరికా క్రికెట్ కౌన్సిల్‌ను ఐసీసీ తప్పుబట్టింది. అమెరికా క్రికెట్ అసమర్ధత వల్లే టోర్నీ నిర్వహణ వ్యయం అమాంతం పెరిగిందని ఐసీసీ ఇంతకుముందే తెలిపింది.
‘టీ20 వరల్డ్ కప్ 2024 నిర్వహణ తీరుపై సమీక్ష అవసరం. ఆ బాధ్యతను ముగ్గురు డైరెక్టర్లు రొజర్ టౌసీ, లాసన్ నాయుడు, ఇమ్రాన్ ఖవాజాలు చూసుకుంటారు. ఈ ఏడాది ఆఖర్లో వీళ్లు సమీక్ష నిర్వహిస్తారు’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. మెగా టోర్నీ కోసం అమెరికాకు ఐసీసీ రూ. 1,000 కోట్ల పైనే కేటాయించింది.

అయితే.. అనూహ్యంగా టోర్నీ బడ్జెట్ రూ.100 కోట్లు ఎక్కువైంది. దాంతో, ఐసీసీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. జూలై 1న న్యూయార్క్ వేదికగా టీ20 వరల్డ్ కప్ మొదలైంది. కొన్ని గ్రూప్‌ల లీగ్ దశ మ్యాచ్‌లను అమెరికాలోని ఫ్లోరిడా, డల్లాస్‌లో నిర్వహించారు. అయితే.. కృత్రిమ పిచ్‌లను ఉపయోగించడం, లో స్కోర్లు నమోదవ్వడం, ఆటగాళ్లకు వసతుల కొరత వంటి వాటితో ప్రపంచ కప్ మజా లేకుండా పోయింది.