హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో 36 మంది భారత ఆర్చర్లు బరిలో నిలవనున్నారు. అక్టోబర్ 8 నుంచి హైదరాబాద్‌లో బరిలో ఈ మెగా లీగ్‌లో 10 దేశాలకు చెందిన 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు కూడా పోటీ పడతారని నిర్వాహకులు ప్రకటించారు. భారత్ నుంచి రికర్వ్ విభాగంలో వెటరన్ ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్, తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ జట్టుకు నేతృత్వం వహిస్తారు. కాంపౌండ్‌లో తెలుగమ్మాయి, భారత అగ్ర ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖతో పాటు అభిషేక్ వర్మ, ఓజాస్ ప్రవీణ్ బరిలో నిలిచారు.
ఈసారి 15 మంది భారత ఆర్చర్లు లీగ్‌లో అరంగేట్రం చేయనున్నారు. 15 సెకండ్ల షాట్ క్లాక్ లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బాణాన్ని ఎక్కుపెట్టి విడిచేందుకు సాధారణ ఒలింపిక్ సమయం 20 సెకండ్లు కాగా ఈ లీగ్‌లో అంతకంటే 5 సెకండ్ల తక్కువ సమయం ఆర్చర్లకు సవాల్‌గా నిలవనుంది. తొలి సీజన్లో రాజ్‌పుతానా రాయల్స్ విజేతగా నిలవగా.. ఈసారి కూడా 6 ఫ్రాంచైజీలు మిక్స్డ్ జెండర్ టీమ్స్ రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో పోటీ పడతాయి.