ముంబై, సెప్టెంబర్ 12 : వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 10 రోజుల పాటు మద్యంపై నిషేధం విధించినందుకు పుణె పాలనా యంత్రాంగాన్ని బాంబే హైకోర్టు మందలించింది. మద్యానికి బానిసైన వ్యక్తులు 10 రోజుల పాటు మద్యం తీసుకోలేకపోతే వారితో దవాఖానలు కిక్కిరిసిపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. పుణెలో మాత్రమే మద్య నిషేధం విధించడంలోని ఔచిత్యం ఏమిటని ప్రధాన న్యాయమూర్తి ఎంపీ త్రిపాఠి, న్యాయమూర్తి అద్వైత్ సేథ్నాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ సందర్భంగా ప్రశ్నించింది.
హైకోర్టు మందలింపు దరిమిలా 10 రోజుల మద్య నిషేధాన్ని పుణె యంత్రాంగం రెండు రోజులకు తగ్గించింది. 14వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 25వ తేదీ రోజంతా మద్యం అమ్మకాలు, వినియోగంపై యంత్రాంగం నిషేధం విధించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం తాగి ఉన్నా లేకున్నా శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందేనని కోర్టు స్పష్టం చేసింది.