దుబాయ్: క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పన్లేదు. ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. కానీ యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో దాయాదుల పోరును స్టేడియంలో చూడటానికి అభిమానులు ఆసక్తి చూపించడం లేదా? ఇరుజట్ల మధ్య ఆదివారం దుబాయ్ వేదికగా జరగాల్సి ఉన్న మ్యాచ్‌కు మాత్రం స్టేడియంలో దాదాపు 40 శాతం టికెట్లు అమ్ముడుపోలేదని వార్తలు వస్తున్నాయి. 25 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న దుబాయ్ స్టేడియంలో శుక్రవారం ఉదయం నాటికి సుమారు 40 శాతం టికెట్లు మిగిలున్నాయని తెలుస్తున్నది.
2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే ప్రపంచకప్, 2023 ఆసియా కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఇరుజట్లు తలపడగా ఆ మ్యాచ్‌లకు టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. ఆదివారం నాటి మ్యాచ్‌లో సాధారణ టికెట్లకు ధరను 99 యూఎస్ డాలర్లు (సుమారు రూ. 8,800)గా నిర్ణయించగా ప్రీమియం టికెట్లకు మాత్రం 4,534 డాలర్లు (భారత కరెన్సీలో రూ. 4 లక్షలు)గా నిర్దేశించారు.
అమ్ముడవని టికెట్లలో సుమారు 50 శాతం ప్రీమియం టికెట్లేనని వినికిడి. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాన్ని ఆగస్టు 29నే ప్రారంభించినా ఇప్పటికీ ఆన్లైన్లో అందుబాటులో ఉండటం గమనార్హం. ఇదిలాఉండగా టికెట్లు అమ్ముడవటం లేదన్న వార్తలపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ.. ‘అందులో నిజం లేదు. బుధవారం రాత్రి మేం ఆన్లైన్లో 3 వేల టికెట్లను ఉంచాం. అవన్నీ అమ్ముడయ్యాయి’ అని పేర్కొంది.