గత కొన్నాళ్లుగా టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లపై ‘నిపుణులు ’ అనే ముసుగు వేసుకుని ఇష్టారీతిన మాట్లాడుతున్నవారికి భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. వాళ్లను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. అభిప్రాయాలను గౌరవించడం వరకు ఓకే గానీ వాటిని నెత్తికెక్కించుకుంటే అనర్థాలు తప్పవని హెచ్చరించాడు.
ఇంగ్లండ్ తో ది ఓవల్ వేదికగా ముగిసిన తొలి వన్డే అనంతరం బుమ్రా విలేకరులతో మాట్లాడుతూ… ‘నేనెప్పుడూ వర్తమానంలో ఉండటానికి ప్రయత్నిస్తా. ఈ రోజుల్లో చాలా మంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ పేరిట వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కొంతమంది నానా చెత్త వాగుతున్నారు. ఒక ఆటగాడి మీద అది తీవ్ర ప్రభావం చూపుతుంది. సదరు ప్లేయర్ లో ఒకరకమైన కన్ఫ్యూజన్ కు గురి చేస్తోంది. కానీ నేను మాత్రం నేను వాటిని పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ పోతా..
నేను ఏ ఫార్మాట్ కు సరిపోతానో అని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ నేను మాత్రం అన్ని ఫార్మాట్లను ఆడటానికి ఇష్టపడతా. నా మీద అలా మాట్లాడిన వారిని నేను గౌరవిస్తాను. కానీ ఆ అభిప్రాయాలను అంత సీరియస్ గా తీసుకోను. అవి మంచివైనా, చెడ్డవైనా సరే. నన్ను అభినందించినా, విమర్శించినా ఒకే విధంగా స్వీకరిస్తా’ అని బుమ్రా చెప్పాడు.