U-19 World Cup | బెనోనీ: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత జట్టు.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించగా.. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా గెలుపొందింది. హోరాహోరీగా సాగిన పోరులో ఆస్ట్రేలియా ఒక వికెట్ తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది.
అజాన్ (52), అరాఫత్ (52) హాఫ్ సెంచరీలు చేశారు. ఆసీస్ బౌలర్లలో టామ్ స్ట్రాకర్ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. హ్యారీ (50), ఒలీవర్ (49) రాణించారు. ఆదివారం జరగనున్న తుదిపోరులో ఆస్ట్రేలియాతో యువ భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.