బులవాయొ: ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న యువ భారత జట్టు జోరు కొనసాగించింది. సూపర్ సిక్స్ గ్రూప్ -2లో భాగంగా మంగళవారం బులవాయొలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత అండర్-19 జట్టు ఏకంగా 204 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తుచేసింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 50 ఓవర్లలో 352/8 పరుగుల భారీ స్కోరు చేసింది.
మిడిలార్డర్ బ్యాటర్ విహాన్ మల్హోత్ర (107 బంతుల్లో 109 నాటౌట్, 7 ఫోర్లు) స్ఫూర్తిధాయక శతకంతో ఆకట్టుకోగా అభిగ్యాన్ (61), వైభవ్ సూర్యవంశీ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఛేదనలో జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 రన్స్‌కే చేతులెత్తేసింది. లిరొయ్ చివాల (62), బ్లిగ్నట్ (37) ఆ జట్టును ఆదుకున్నారు. సూపర్ సిక్స్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్.. తమ తదుపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 1న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడుతుంది.
మొదట బ్యాటింగ్ చేస్తూ సూర్యవంశీ దూకుడుతో పది ఓవర్లకే వంద పరుగుల మార్కును దాటిన భారత్.. ఆ తర్వాత తడబడి 16 ఓవర్లలో 130/4తో నిలిచింది. ఈ క్రమంలో విహాన్, అభిగ్యాన్ ఐదో వికెట్‌కు 113 రన్స్ జతచేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఆఖర్లో అభిగ్యాన్ నిష్క్రమించినా ఖిలాన్ పటేల్ (12 బంతుల్లో 30*, 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధనాధన్ ఆటతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇక స్కోరుబోర్డుపై ఒక్క పరుగూ చేరకుండానే వికెట్ల ఖాతా తెరించిన జింబాబ్వే.. 33 ఓవర్లలో 141/4తో కాస్త మెరుగ్గానే కనిపించింది. కానీ 7 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 6 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో కెప్టెన్ అయూశ్ మాత్రె (3/14), ఉద్ధవ్ మోహన్ (3/20) జింబాబ్వే లోయరార్డర్ పనిపట్టారు.
భారత్: 50 ఓవర్లకు 352/8 (విహాన్ 109*, అభిగ్యాన్ 61, చిముగొరొ 3/49, సింబరషె 2/51);
జింబాబ్వే: 37.4 ఓవర్లలో 148 ఆలౌట్ (లిరొయ్ 62, బ్లిగ్నట్ 37, మాత్రె 3/14, ఉద్ధవ్ 3/20)