బులవాయో: ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ సూపర్ సిక్స్‌లోకి దూసుకెళ్లింది. సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ కప్ వేటలో మరో అడుగు వేసింది. తమ చివరి లీగ్ పోరులో భాగంగా శనివారం జరిగిన పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై(డీఎల్ఎస్) 141 బంతులు మిగిలుండగానే ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం మధ్య సాగిన మ్యాచ్‌లో కివీస్‌పై టీమ్ఇండియాదే పైచేయి అయ్యింది. ఈ విజయంతో గ్రూపు దశలో మూడింటికి మూడు గెలిచిన భారత్ అగ్రస్థానంతో సూపర్సిక్స్లోకి ప్రవేశించింది.
తొలుత అంబరీశ్(4/29), హెనిల్పటేల్(3/23) ధాటికి కివీస్ 36.2 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. వీరిద్దరి విజృంభణతో కల్లమ్ సాంప్సన్(37 నాటౌట్) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత నిర్దేశిత లక్ష్యఛేదన(37 ఓవర్లలో 130)కు దిగిన భారత్ 13.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. కెప్టెన్ ఆయూశ్ మాత్రె(27 బంతుల్లో 53, 2ఫోర్లు, 6సిక్స్‌లు), వైభవ్ సూర్యవంశీ(23 బంతుల్లో 40, 2ఫోర్లు, 3సిక్స్‌లు) అదరగొట్టడంతో గెలుపు నల్లేరుపై నడకయ్యింది.నాలుగు వికెట్లతో విజృంభించిన అంబరీశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. సూపర్ సిక్స్ తొలి పోరులో యువ భారత్ ఈనెల 27న జింబాబ్వే, ఫిబ్రవరి 1న దాయాది పాకిస్థాన్‌తో తలపడుతుంది.
టాస్ గెలువగానే మరో ఆలోచన లేకుండా భారత కెప్టెన్ ఆయూశ్మాత్రె..న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బౌలింగ్‌కు పూర్తిగా తమకు అనుకూలంగా ఉండటంతో అంబరీశ్, హెనిల్ పదునైన పేస్‌తో కివీస్‌ను ఘోరంగా దెబ్బకొట్టారు. సూపర్స్వింగ్తో వరుసగా వికెట్లు తీసి స్వల్ప స్కోరుకు పరిమితం చేశారు. ఓపెనర్ హ్యుగో బోగ్(5)తో మొదలైన కివీస్ వికెట్ల పతనం ఆఖరి వరకు దిగ్విజయంగా సాగింది. ఆఖర్లో సాంప్సన్‌కు తోడు సెల్విన్ సంజయ్(28), కాటర్(23) ఆకట్టుకోవడంతో వంద పరుగుల మార్క్ దాటింది.
న్యూజిలాండ్ : 36.2 ఓవర్లలో 135 ఆలౌట్(సాంప్సన్ 37 నాటౌట్, సంజయ్ 28, అంబరీశ్ 4/29, హెనిల్ 3/23),
భారత్ : 13.3 ఓవర్లలో 130/3(ఆయూశ్ 53, వైభవ్ 40, సంజయ్ 1/22, క్లార్కె 1/29)