దుబాయ్: ఈ నెల 30 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో అంపైరింగ్ బాధ్యతలను పూర్తిగా మహిళలే నిర్వర్తించనున్నారు. వన్డే ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాబోయే ఎడిషన్‌లో ఫీల్డ్ అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు అంతా మహిళలే ఉండనున్నారు. ఈ మేరకు ఐసీసీ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ సందర్భంగా ఐసీసీ చైర్మన్ జై షా స్పందిస్తూ.. ‘మహిళల క్రికెట్ ప్రయాణంలో ఇది ఒక మైలురాయి మాత్రమే కాదు.. క్రికెట్లో స్త్రీ, పురుషుల సమానత్వానికి ఐసీసీ నిబద్ధతకు నిదర్శనం’ అని పేర్కొన్నారు. గతంలో కామన్వెల్త్ క్రీడలు (2022), 2024 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో పూర్తిస్థాయి మహిళా అంపైరింగ్ ప్యానెల్‌తో టోర్నీలను నిర్వహించినా వన్డే ప్రపంచకప్‌లో ఇలా చేయనుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం.