ఉలన్బాతర్(మంగోలియా): ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల 50కిలోల క్వార్టర్స్‌లో యువ బాక్సర్ విశ్వనాథ్ సురేశ్ 5-0 తేడాతో ప్రపంచ చాంపియన్ సాంజార్ తశ్కెన్బె(కజకిస్థాన్)పై సంచలన విజయం సాధించాడు. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన విశ్వనాథ్..ప్రత్యర్థిపై ఆది నుంచే పవర్ఫుల్ పంచ్‌లతో విరుచుకుపడ్డాడు.
తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న బాక్సర్‌ను ఏ మాత్రం లెక్కచేయని ఈ తమిళనాడు బాక్సర్ రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయాడు. ఓవైపు పంచ్‌లు సంధిస్తూనే మరోవైపు అద్భుతమైన లెగ్ వర్క్‌తో ప్రత్యర్థి ప్రతిదాడులను దీటుగా తిప్పికొట్టాడు. ఇటీవల జరిగిన ఎలైట్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో మెరిసిన హవాల్దార్ విశ్వనాథ్..బౌట్లో చురుకైన వేగంతో కదులుతూ మెరుపులా పంచ్‌లు సంధించడంలో ఆరితేరాడు.