గువాహటి: దేశవాళీ టోర్నీ రంజీల్లో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. రంజీ పోరులో భాగంగా సర్వీసెస్, అస్సాం మధ్య మ్యాచ్ పలు రికార్డులకు వేదికైంది. ఈ రెండు జట్ల పోరు 90 ఓవర్లలోనే పూర్తి అయ్యింది. సుదీర్ఘ రంజీ చరిత్రలో ఇది కొత్త రికార్డుగా నమోదైంది. ఓవర్‌నైట్ స్కోరు 56/5తో రెండో రోజు ఆదివారం ఇన్నింగ్స్‌కు దిగిన అస్సాం 75 పరుగులకే కుప్పకూలింది.
అర్జున్ శర్మ(4/20), అమిత్శుక్లా(3/6) అస్సాం పతనాన్ని శాసించారు. 71 పరుగుల లక్ష్యాన్ని సర్వీసెస్ 13.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. రవి చౌహాన్(20 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా, రియాన్ పరాగ్(2/31)రెండు వికెట్లు తీశాడు. ఇదే మ్యాచ్‌లో ఇద్దరు బౌలర్లు అర్జున్‌శర్మ, మోహిత్ జంగ్రా హ్యాట్రిక్ ఫీట్ నమోదు చేశారు. రంజీల్లో ఒకే పోరులో రెండు హ్యాట్రిక్‌లు నమోదు కావడం ఇదే తొలిసారి.
పుదుచ్చేరితో జరుగుతున్న రంజీ గ్రూపు-డీ పోరులో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 435 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రాహుల్‌సింగ్(114) సెంచరీతో కదంతొక్కగా, రాహుల్ రాదేశ్(81), హిమతేజ(66), తన్మయ్(50) అర్ధసెంచరీలతో రాణించారు. ఉదేశి(4/110) నాలుగు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరి వికెట్ కోల్పోయి 25 పరుగులు చేసింది.