లాహోర్: ప్రతిష్టాత్మక ఆసియాకప్ టోర్నీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) 17 మందితో ఆదివారం తమ జట్టును ప్రకటించింది. ఇటీవలి ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఆసియాకప్‌తో పాటు యూఏఈ, అఫ్గానిస్థాన్‌తో జరిగే ముక్కోణపు టీ20 సిరీస్ కోసం టీమ్‌ను ఎంపిక చేసింది. అయితే గత కొంత కాలంగా ఫామ్‌లేమితో జట్టుకు భారంగా మారిన మాజీ కెప్టెన్లు బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్‌కు సెలెక్టర్లు మొండిచేయి చూపారు. ముక్కోణపు సిరీస్‌తో పాటు ఆసియా కప్ టీమ్‌లో కూడా ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు చోటు దక్కించుకోలేకపోయారు. రెండు సిరీస్‌లకు జట్టును ప్రకటిస్తూ పాకిస్థాన్ చీఫ్ కోచ్ మైక్ హెస్సెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
స్పిన్ బౌలింగ్ ఆడటంలో ఆజమ్ తడబడుతున్నాడని, అతను మరింత మెరుగు అవ్వాల్సింది ఉందని స్పష్టం చేశాడు. సల్మాన్ అగా కెప్టెన్‌గా వ్యవహరించనున్న పాక్ టీమ్‌లో షాహిన్ షా అఫ్రిదీ, మహమ్మద్ వసీం, సల్మాన్ మీర్జా చోటు నిలుపుకున్నారు. వచ్చే నెల 9 నుంచి మొదలయ్యే ఆసియాకప్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ సహా, యూఏఈ, ఒమన్‌తో కలిసి పాక్..గ్రూపు-ఏలో బరిలోకి దిగుతున్నది.