రెండు వరుస ఓటములతో నీరుగారిపోయిన టీమ్ఇండియా.. సాంకేతికంగా సెమీస్ పోటీలో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో అఫ్గానిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది! పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో పరాజయాలు ఎదుర్కొన్న భారత్.. దెబ్బతిన్న సింహంలా విజృంభిస్తుందా.. లేక మూడో ఓటమితో రేసు నుంచి తప్పుకుంటుందా నేడు తేలనుంది! జట్టు ఎంపిక నుంచి, ఆటగాళ్ల దృక్పథం వరకు అనేక సమస్యలతో సతమతమవుతున్న కోహ్లీసేన సమిష్టిగా సత్తాచాటాలని అభిమానులు ఆశిస్తుంటే.. సంచలనం నమోదు చేయాలని అఫ్గానిస్థాన్ తహతహలాడుతున్నది!
అబుదాబి: ఘోర పరాజయాలతో సెమీఫైనల్ అవకాశాలను దాదాపు దూరం చేసుకున్న టీమ్ఇండియా.. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో బుధవారం అఫ్గానిస్థాన్‌తో తలపడనున్నది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఖంగుతిన్న కోహ్లీ సేన.. రెండో పోరులో న్యూజిలాండ్ చేతిలో అవమానకర ఓటమి మూటగట్టుకుంది. ఇక గ్రూప్-2లో మిగిలిన మూడు మ్యాచ్‌లు నెగ్గినా.. ముందడుగు వేయ డం కష్టమైన తరుణంలో నేడు కాబూలీలను ఎదుర్కోనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్న టీమ్ఇండియా.. అదే వరస కొనసాగిస్తే కోహ్లీసేనకు అఫ్గాన్ షాకివ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. నమీబియా, స్కాట్లాండ్పై నెగ్గి.. పాకిస్థాన్‌ను ఓడించినంత పనిచేసిన అఫ్గానిస్థాన్‌పై నెగ్గాలంటే టీమ్ఇండియా శక్తివంచన లేకుండా పోరాడాల్సి ఉంటుంది. గత రెండు మ్యాచ్‌ల వైఫల్యాలను గమనిస్తే.. ప్రత్యర్థి జట్లకు కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయిన టీమ్ఇండియా.. ఈ మ్యాచ్‌లోనైనా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని అభిమానులు అశిస్తున్నారు. భారత్ నాకౌట్ పోటీలో ఉండాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. దుబాయ్ పిచ్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కోహ్లీసేన.. అబుదాబిలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నది! పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నమీబియా కంటే కింద ఉన్న టీమ్ఇండియా.. ఈ మ్యాచ్‌లో కేవలం గెలువడం మాత్రమే కాకుండా రన్‌రేట్ మెరుగుపర్చుకోవాల్సి ఉంది. సూర్యకుమార్ యాదవ్ గాయంపై స్పష్టత లేకపోవడంతో.. ఇషాన్ కిషన్‌ను కొనసాగించడం ఖాయమే కాగా.. గత మ్యాచ్ మాదిరిగా అతడిని ఓపెనర్‌గా దింపుతారా చూడాలి! మెగాటోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతానని ముందే ప్రకటించిన విరాట్ కోహ్లీ తనకొచ్చొచ్చిన మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగడం మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి పెద్దగా ప్రభావం చూపలేకపోతుండటంతో అతడి స్థానంలో చాహర్, అశ్విన్‌లలో ఒకరిని జట్టులోకి తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం!
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ఇషాన్, రాహుల్, పంత్, హార్దిక్, జడేజా, శార్దూల్, షమీ, వరుణ్, బుమ్రా.అఫ్గానిస్థాన్: నబి (కెప్టెన్), హజ్రతుల్లా, షహజాద్, రహ్మనుల్లా, హష్మతుల్లా, నజీబ్, నైబ్, రషీద్, ముజీబ్, నవీన్, హమీద్.
పిచ్, వాతావరణం
టీమ్ఇండియా గత రెండు మ్యాచ్‌లు ఆడిన దుబాయ్ పిచ్‌తో పోల్చుకుంటే.. అబుదాబి పిచ్ పేసర్లకు సహకరించనుంది. ప్రపంచకప్‌లో భాగంగా ఇక్కడ జరిగిన 8 మ్యాచ్‌ల్లో ఆరింట ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. వర్ష సూచన లేదు.