ఢిల్లీ: ఐపీఎల్-19 ఫైనల్ వేదికను గత సీజన్లో టైటిల్ గెలిచిన ఆర్సీబీ హోంగ్రౌండ్ చిన్నస్వామికి కాకుండా అహ్మదాబాద్‌కు కేటాయించడంపై లీగ్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ స్టేడియంలో సీటింగ్ కెపాజిటీ ఎక్కువుండటంతో పాటు కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) తమకు కేటాయించిన ఉచిత టికెట్ల కోటా కంటే ఎక్కువ డిమాండ్ చేయడం వల్లే వేదికను మార్చాల్సి వచ్చిందని అన్నారు. ‘చిన్నస్వామి సామర్థ్యం చాలా చిన్నది. అదీగాక అక్కడ రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రజా ప్రతినిధులు ఉచిత టికెట్లు అడుగుతున్నారు.
మేం కేఎస్సీఏతోనూ సంప్రదింపులు జరిపాం. నిరుడు జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ధుమాల్ తెలిపారు. కేఎస్‌సీఏ 10 వేల టికెట్లు ఎక్కువ డిమాండ్ చేసిందని సైకియా పేర్కొన్నారు. ‘ఐపీఎల్ ప్రోటోకాల్ ప్రకారం స్థానిక క్రికెట్ సంఘానికి మొత్తం సీట్లలో 15 శాతం కేటాయిస్తాం. కానీ కేఎస్‌సీఏ మాత్రం అంతకుమించి అదనంగా 10 వేల టికెట్లు కావాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం కూడా కాంప్లిమెంటరీ టికెట్ల కింద 700 టికెట్లు కావాలని కోరింది’ అని చెప్పారు.