గీసుగొండ, ఆగస్టు 13 : గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని గణేశా ఎకోపిట్ కంపెనీలో స్టీమ్ పైపులైన్ పేలిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు (టెక్నీషియన్లు) సజీవ దహనమయ్యారు. కార్మికులు, స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గణేశా కంపెనీలో వాడిన ప్లాస్టిక్ బాటిళ్లతో ప్లాస్టిక్ చిప్స్, ప్లేక్స్, ఫైబర్, యార్న్(దారం)తో పాటు పలు రకాల ఉత్పత్తులను తయారు చేస్తారు. కంపెనీ యూనిట్ ఆరు అంతస్తులు ఉంటుంది. ప్లాస్టిక్ కరగదీసిన యార్న్‌తో ప్లేక్స్ తయారు చేయడానికి స్టీమ్ ను వాడుతున్నారు. దీని కోసం కింది నుంచి పైఅంతస్తు వరకు స్టీమ్ పైపులైన్ ఏర్పాటు చేశారు.
బుధవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో యూనిట్‌లోని నాల్గో అంతస్తు వద్ద స్టీమ్ పైపులైన్ హఠాత్తుగా పేలి మంటలు వ్యాపించాయి. గమనించిన ఉద్యోగులు, కార్మికులు అప్రమత్తమై మెట్ల ద్వారా కిందికి దిగారు. టెక్నీషియన్లుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌కు చెందిన సూర్యప్రకాశ్ (31), వారణాసికి చెందిన అభిలాష్ (వినోద్ ప్రజాప్రతి) (30) నాల్గో అంతస్తుకు వెళ్లగా అక్కడ మంటలు వ్యాపించడంతో వేగంగా కిందికి దిగి ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో లిప్టు ఎక్కారు.
మంటలు తీవ్రమై లిప్టుకు అంటుకోవ డంతో బయటకు రాలేని స్థితిలో వారు సజీవ దహనమయ్యారు. వారి శరీరాలు మాంసం ముద్దలుగా మారాయని కార్మికులు వాపోయారు. అయితే మంటలు వ్యాపించిన క్రమంలో ముందు జాగ్రత్తగా కరెంట్ సరఫరాను ఆపివేయడంతో లిప్టు మధ్యలోనే ఆగిపోగా అందులోనే సజీవ దహనమయ్యారని కార్మికులు చెబుతున్నారు. ఇదే అంతస్తులో ఓ ఎలక్ట్రీషియన్ కిటికీ అద్దాలను పగలగొట్టి కిందకి దూకి ప్రాణాలను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
రాత్రి 2 గంటల ప్రాంతంలో వరంగల్, నర్సంపేట, ఎనుమాముల మార్కెట్ నుంచి మూడు ఫైర్ ఇంజన్లు వెళ్లి మంటలు ఆర్పివేశాయి. మృతులిద్దరికి వివాహాలు కాగా వారి కుటుంబసభ్యులు స్వగ్రామాల్లో ఉంటున్నట్లు కార్మికులు తెలిపారు. సూర్యప్రకాశ్ తమ్ముడు పవన్ ఇదే కంపెనీలో పనిచేస్తుండగా తమకు న్యాయం చేసే వరకు మృతదేహాలను తరలించవద్దని గొడవకు దిగాడు. గురువారం ఘటనా స్థలానికి మమూనూరు ఏసీపీ వెంకటేశ్, సీఐ విశ్వేశ్వర్, పోలీసులు చేరుకొని పరిశీలించి కంపెనీ వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి పార్కులో కంపెనీ బస్సు కింద పడి ఓ మహిళ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు. పార్కులో జరిగే ఘటనలపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.