హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేసేందుకే రేవంత్ సర్కార్ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించిన జీవో 8ను న్యాయస్థానం నిలిపివేయడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఆడపిల్లల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రోజుకు 18 గంటలు రివ్యూలు చేస్తున్నట్టు చెప్పుకొంటున్న సీఎం రేవంత్‌రెడ్డి కోర్టు పరిధిలో ఉన్న కీలక జీవో 8పై ఎందుకు సమీక్ష చేయలేదని నిలదీశారు. ప్రభుత్వం తరఫున న్యాయస్థానంలో వాదనలు వినిపించడంలో ఏజీ, లా సెక్రటరీ, సీఎస్ విఫలమయ్యారని మండిపడ్డారు.
ఈ రెండు పథకాల నోడల్ ఏజెన్సీ బాధ్యతలు చూస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ అంశంపై స్పందించాలని, ధైర్యముంటే గన్పార్ వద్దకు బహిరంగ చర్చకు రావాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్ విసిరారు. ఒకవైపు ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు నిలిచిపోతుంటే, మరోవైపు మంత్రులు అమెరికాలో ఆటా, నాటా వేడుకల్లో విహరిస్తున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణ నిధుల కట్టలు డల్లాస్ వరకు చేరుతున్నాయని అనుమానం వ్యక్తంచేశారు. తన శాఖలో ఫైళ్ల క్లియరెన్స్‌కు కమీషన్లు తీసుకుంటారనే ప్రచారంలో ఉన్న మంత్రి.. నిధులు అమెరికాకు తరలిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేని విధంగా ఉచిత సంక్షేమ పథకాల జీవోలను కోర్టు నిలిపివేసే పరిస్థితి రావడం కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలని గుర్తుచేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో నాడు హామీ ఇవ్వకపోయినా ఆయన ఈ పథకాన్ని అమలు చేశారని పేర్కొన్నారు. జీవో8పై న్యాయస్థానంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి కూడా ప్రభుత్వానికి సమయం లేకుండా పోయిందా? అని ప్రశ్నించారు. అసలు కోర్టులో పిటిషన్ వేసిందే సీఎం రేవంత్, కాంగ్రెస్ సర్కారేమోనన్న అనుమానం కలుగుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కోర్టులో సమగ్రమైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు సీతక, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ తాము ఏ నేపథ్యం నుంచి వచ్చామో, తమ మూలాలు ఏమిటో పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు. కల్యాణలక్ష్మి ద్వారా గతంలో ఇచ్చే రూ. 1,00,116తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మొత్తానికే పథకాన్ని ఎగ్గొట్టే కుట్రకు తెరలేపిందని పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయడం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ పథకాలను బంద్ పెట్టి, దానికి బదులుగా సూటుకేసులు ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పకనబెట్టి రాజకీయ కక్షసాధింపు చర్యలకు ప్రాధాన్యమిస్తున్నదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు సుమిత్రానంద్, సత్య, అబ్రార్ తదితరులు పాల్గొన్నారు.