మున్సిపల్ పాట ఎకరానికి 20లక్షలు?
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బల్దియాలో ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు చేసే రియల్టర్ల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు సమకూర్చుకునేందుకు అధికారులు, కౌన్సిలర్లు వసూళ్ల ‘పాట’ మొదలు పెట్టారు. సర్కారు వారి పాట... అనే చందంగా మున్సిపల్ కౌన్సిల్ వారి పాట అనేది తలపిస్తోంది.
- హుస్నాబాద్ మున్సిపాలిటీకి రియల్టర్లు చెల్లించాలని డిమాండ్
- వెంచర్లు, ఓపెన్ ప్లాట్లు మీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోండి.. మాకు డబ్బులిస్తే చాలు
- లాడ్జిలో రహస్యంగా కౌన్సిలర్ల సమావేశం
- నాలా ఫీజు కట్టినా మా అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్ చేయొద్దని సబ్‌రిజిస్ట్రార్‌కు నోటీసులు
- లబోదిబోమంటున్న రియల్టర్లు
- మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్ల తీరుపై మండిపాటు
హుస్నాబాద్, ఆగస్టు 13: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బల్దియాలో ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు చేసే రియల్టర్ల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు సమకూర్చుకునేందుకు అధికారులు, కౌన్సిలర్లు వసూళ్ల ‘పాట’ మొదలు పెట్టారు. సర్కారు వారి పాట… అనే చందంగా మున్సిపల్ కౌన్సిల్ వారి పాట అనేది తలపిస్తోంది. హుస్నాబాద్ పట్టణ శివారులో వెలుస్తున్న వెంచర్లు నిబంధనలకు విరుద్ధంగా పెడుతున్నప్పటికీ అవేమీ పట్టకుండా ‘మాకేంటీ’ అంటూ ముందుకొస్తున్నారు తప్పా నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసే వారు కరువయ్యారు.
మున్సిపల్లో తమను అడిగేవారు లేరనే ధైర్యంతో వివాదాస్పద స్థలాలతో పాటు వ్యవసాయ భూములను ఇష్టారాజ్యంగా ఎలాంటి లేఅవుట్లు, అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తున్నారు. దీంతో కోట్లలో వ్యాపారం జరుగుతున్నప్పటికీ మున్సిపల్‌కు రూపాయి ఆదాయం రావడం లేదు. మీరేమైనా చేసుకోండి… మాకు డబ్బులిస్తేచాలంటూ అధికారులు, కౌన్సిలర్లు రియల్టర్లకు అల్టిమేటం జారీ చేయడం విశేషం. ఏకంగా ఎకరం వెంచర్‌కు రూ.20 లక్షలు డిమాండ్ చేస్తున్నారు, లేకుంటే మీ వ్యాపారాలు నడవవంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారులు, కౌన్సిలర్ల తీరుతో రియల్టర్లు లబోదిబోమంటున్నారు.
గతంలో ఎకరానికి రూ.2లక్షలు..
ఇప్పుడు రూ.20లక్షలు హుస్నాబాద్ పట్టణంలో మొదట్లో ఎకరానికి రూ.2లక్షలు ఇచ్చేవారని, అనంతరం రియల్టర్లతో చర్చలు జరిపి దానిని కాస్తా రూ.3లక్షలకు పెంచారని కొందరు భూవ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కౌన్సిల్ ఏకంగా రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం రియల్టర్ల గుండెల్లో రాయిపడినైట్లెంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న బిజినెస్‌లో ఎకరానికి ఏకంగా రూ.20లక్షలు వీళ్లకే ఇస్తే ఇక మాకేం మిగులుతుందని తమలోతామే చర్చించుకుంటున్నట్లు సమాచారం.
మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల అత్యాశ వల్ల రియల్టర్లు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చేందుకు ఉన్న నిబంధనలను మొత్తం తుం గలో తొక్కుతున్నారు. ‘వెంచర్ వేసే ముందు అది నివాసయోగ్యమా కాదా అనేది పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఎంత భూమిని ప్లాట్లుగా మారుస్తున్నారో మున్సిపల్, రెవెన్యూ అధికారులకు చెప్పాలి. ప్లాట్లు పెట్టే స్థలంలో మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగా రోడ్ల వెడల్పు ఉండాలి. మున్సిపల్ పేరున కనీసం 30శాతం భూమిని మార్టిగేజ్ చేయా లి. గుడి, బడి, పార్కు తదితర అవసరాలకు స్థలం వదిలేయాలి. సామాన్యులు సైతం కొనుగోలు చేసే విధంగా ధరలు నిర్ణయించాలి. మున్సిపల్‌కు కొంత రుసుం చెల్లించాలి…’ కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా భూ వ్యాపారులు పాటించడం లేదు. ఇందుకు కారణం అధికారు లు, ప్రజాప్రతినిధుల కక్కుర్తేనని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు.
లాడ్జిలో సమావేశం రూ.20లక్షలకు కౌన్సిలర్ల ఏకగ్రీవ తీర్మానం
హుస్నాబాద్ పట్టణంలోని ఓ లాడ్జిలో కౌన్సిలర్లందరూ ఇటీవల రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. చర్చోపచర్చల అనంతరం పట్టణ పరిధిలో ఎక్కడ కొత్త వెంచర్ పెట్టినా ముందుగా మున్సిపల్ కౌన్సిల్‌కు ఎకరానికి రూ.20లక్షలు ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇందుకు సంబంధించి అధికారులు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పొద్దనే నిబంధన సైతం పెట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎంతో గోప్యంగా ఉంచాలని కూడా నిర్ణయించుకున్నారు. మున్సిపల్ ప్రధాన అధికారితో పాటు సంబంధిత అధికారులకు సైతం తమ నిర్ణయాన్ని చెప్పి స్థానిక రియల్టర్లకు నాయకత్వం వహించే ఓ వ్యక్తికి సమాచారం అందించినట్లు విశ్వసనీయ సమాచారం.
నలా ఫీజు చెల్లించినా రిజిస్ట్రేషన్లు చేయొద్దని సబ్ రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు
హుస్నాబాద్ పట్టణంలో వెలిసే వెంచర్లకు నాలా ఫీజు చెల్లించినప్పటికీ మా అనుమతి లేకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయొద్దని మున్సిపల్ అధికారులు సబ్ రిజిస్ట్రార్‌కు లేటర్ ద్వారా ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్ పడింది. ఇదంతా అధికారులు, పాలకవర్గం కుమ్మక్కుతోనే జరుగుతోందంటూ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు ఆపితే సచ్చుకుంటూ తమవద్దకు వస్తారనేది అధికారులు, పాలకవర్గం పన్నాగమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి వెంచర్లు చేస్తే అందులో సగం అమ్ముడు పోవడం లేదని, ఎంతకొంతకు అమ్ముకొని పెట్టిన పెట్టుబడులు తీసుకుందామంటే మున్సిపల్ అధికారులు, పాలకవర్గం మరింత నష్టాల్లోకి నెట్టుతున్నారని కొందరు రియల్టర్లు వాపోతున్నారు.
మున్సిపల్ అధికారులు లెటర్ ఇచ్చింది వాస్తవమే
హుస్నాబాద్‌లో ఇప్పటి వరకు పెట్టిన వెంచర్లతో పాటు తర్వాత పెట్టబోయే వెంచర్లకు సంబంధించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయొద్దని మున్సిపల్ నుంచి లెటర్ ఇచ్చారు. మేము ఇటీవల కొన్నింటిని ఆపేశాం. నాలా ఫీజు చెల్లించినా రిజిస్ట్రేషన్లు చేయొద్దంటున్నారు. నాలా ఉంటే రిజిస్త్రేషన్ చేయాలనే నిబంధన మాకు ఉన్నది. కానీ మున్సిపల్ అధికారులు ఆపాలని లెటర్ ఇచ్చారు. అయితే నాలా చెల్లింపులు జరగకుండా రెవెన్యూ కార్యాలయంలోనే నిలుపుదల చేస్తే బాగుండేది.
– ఎంఏ జబ్బార్, సబ్ రిజిస్ట్రార్, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా)
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

