న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలను జులై 4వ తేదీన నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) సన్నద్ధమౌతోంది. ఇందుకోసం కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేష్ మిట్టల్‌ను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించాలని కోరుతూ లేఖ రాసింది. ఎన్నికలను ప్రత్యేక సర్వసభ్య సమావేశం సందర్భంగా నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశం తేదీని రిటర్నింగ్ అధికారి నిర్ణయానికే వదిలేస్తున్నట్టు ఐఓఏ తెలిపింది.
ఈ ఎన్నికలలో అధ్యక్ష పదవినుంచి తప్పుకుంటున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్, అతని బంధు మిత్రులు పోటీచేసేందుకు అనర్హులుగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. గతంలో జూన్ 30న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినా, ఎన్నికల నోటిఫికేషన్‌కు తగిన వ్యవధి లేనందున తేదీని వాయిదా వేశారు. ఇపుడు జులై 4 లేదా ఆ తరువాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.