Team India | హరారే: యువ భారత్ టీ20 సిరీస్‌పై గురిపెట్టింది. జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం నాలుగో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తున్నది. సీనియర్ల గైర్హాజరీలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కుర్రాళ్లు తహతహలాడుతున్నారు. తొలి పోరులో అనూహ్య ఓటమి తర్వాత పుంజుకున్న భారత్ వరుస విజయాలతో జోరుమీద ఉన్నది.
యశస్వి జైస్వాల్, శాంసన్, శివమ్‌దూబే రాకతో జట్టు మరింత పటిష్ఠంగా మారింది. గత మ్యాచ్‌లో గిల్, జైస్వాల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టగా, వన్‌డౌన్‌లో అభిషేక్ బ్యాటింగ్‌కు వచ్చాడు. బౌలింగ్ పరంగా చూస్తే ముకేశ్‌కుమార్, అవేశ్‌ఖాన్, ఖలీల్ అహ్మద్ పేస్ త్రయానికి సుందర్, బిష్ణోయ్ స్పిన్ ద్వయం తోడైతే జింబాబ్వేను పడగొట్టడం పెద్ద పనికాకపోవచ్చు. జింబాబ్వే గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెప్టెన్ రజా మినహా ఎవరికీ పెద్దగా అనుభవం లేకపోవడం జట్టు విజయ అవకాశాలపై ప్రభావం చూపిస్తున్నది.