నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : గతమెంతో ఘనం..ప్రస్తుతమే దైవాధీనం అన్నట్లు ఉంది చారిత్రక ఎల్బీ స్టేడియం పరిస్థితి. సరిగ్గా 75 ఏండ్ల క్రితం 1950లో నిర్మితమైన ఫతేమైదాన్(ఎల్బీ స్టేడియం) ఎన్నో చారిత్రక సందర్భాలకు వేదిక. అసఫ్ జాహీ పాలనలో మొఘల్ సైనికుల విజయోత్సవానికి వేదికైన ఫతే మైదాన్ ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చింది. భారత క్రికెట్ జట్టుకు పెట్టని కోట లాంటి స్టేడియం అంతకంతకు ప్రభ కోల్పోతున్నది. లెక్కకు మిక్కిలి జాతీయ, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు వేదికైన స్టేడియం ప్రస్తుతం ప్రైవేట్ ఫంక్షన్ ప్యాలెస్‌ను తలపిస్తున్నది. సంధు దొరికినప్పుడల్లా స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, క్రీడలకు పెద్దపీట అంటూ ఊదరగొడుతున్న రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధనార్జనే ధ్యేయంగా ఎల్బీ స్టేడియాన్ని విచ్చలవిడిగా వాడుతున్నది.
ఇప్పటికే పలు రాజకీయ పార్టీల సమావేశాలకు కేంద్రబిందువుగా మారిన స్టేడియం తాజాగా సంగీత కచేరీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది. నగరం నడిబొడ్డున అందరికీ అనుకూలంగా ఉన్న స్టేడియంలో క్రీడా టోర్నీలు నిర్వహించాల్సింది పోయి ప్రైవేట్ కార్యక్రమాలకు అడ్డగా మారిపోయింది. ఇటీవలి వర్షాలకు చిత్తడిగా మారిన మైదానం కార్యక్రమాల నిర్వహణతో పూర్తిగా రూపురేఖలు కోల్పోయి బురదమయంగా మారింది. దేశానికి భవిష్యత్ ప్లేయర్లను అందించాల్సిన స్టేడియం కాస్తా సాట్స్‌కు కిరాయి అందించే వనరుగా మారింది. స్టేడియం పరిస్థితిపై ఔత్సాహిక క్రీడాకారులు, మాజీ ప్లేయర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫతే మైదాన్(ఎల్బీ స్టేడియం) దీనస్థితికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడలకు పెద్దపీట వేస్తున్నామంటూ జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలమవుతున్నది. ఉన్న స్టేడియాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్న ప్రభుత్వం వాటిని ప్రైవేట్ కార్యక్రమాలకు అడ్డాగా మారుస్తున్నది. ఈవెంట్‌కు ఇంత అంటూ బడ్జెట్ నిర్ణయిస్తూ సంగీత కచేరీలు నిర్వహిస్తున్నది. గతంలోనే ఒక ప్రముఖ బాలీవుడ్ సింగర్ మ్యూజికల్ నైట్‌తో తీవ్ర విమర్శల పాలైన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరో కార్యక్రమానికి తెరతీసింది.
శనివారం ఒక ప్రముఖ టీవీ ఆధ్వర్యంలో ఫోక్నైట్ నిర్వహిస్తున్నారు. దీని కోసం స్టేడియంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. కార్యక్రమ నిర్వహణ కోసం సామాగ్రిని తరలించేందుకు భారీ వాహనాలను మైదానంలోకి తీసుకురావడంతో మైదానం మొత్తం రూపురేఖలు కోల్పోయింది. ఇందుకు అద్దె కింద సాట్స్‌కు 9 లక్షలు చెల్లించినట్లు తెలి సింది. టికెట్ల ద్వారా తిరిగి రెట్టింపు మొత్తంలో డబ్బును పొందేందుకు ప్రయత్ని స్తున్నాయి.
క్రికెట్‌తో పాటు పలు క్రీడాటోర్నీలకు ఆతిథ్యమిచ్చే ఎల్బీ స్టేడియం ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకునే పరిస్థితికి వచ్చింది. అసలు ఇది స్టేడియమేనా అన్న స్థితిలో కనిపిస్తున్నది. భారీ స్థాయిలో వచ్చే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని నిర్వహకులు పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు, భారీ స్టేజ్ సెటప్‌తో నానా హంగామా కనిపిస్తున్నది. క్రీడలకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రైవేట్ కార్యక్రమాలకు కిరాయి ఇస్తూ డబ్బులు ఆర్జించడంపై క్రీడాభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘పే అండ్ యూజ్’ తరహాలో సాట్స్ అవలంభిస్తున్న వైఖరిని తప్పుబడుతున్నారు. తమ కార్యక్రమాల నిర్వహణ కోసం కొందరు సాట్స్‌తో సంబంధం లేకుండా మంత్రులు, సీఎం స్థాయిలో పైరేవీలు చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు.
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) తీరు మారడం లేదు. ఇది వరకే గచ్చిబౌలి స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకుడు కార్యక్రమానికి అద్దె ఇచ్చి అభాసుపాలైన సాట్స్ తమ వైఖరి మార్చుకోలేదు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే స్థాయికి రాష్ట్ర ప్లేయర్లు ఎదగాలని సీఎం గొప్పలకు పోతూ ఉంటే సాట్స్ మాత్రం ఆదాయ ఆర్జన కోసం పెడదారి పడుతున్నది. స్టేడియం మెయింటెన్స్ కోసం లక్షలకు లక్షలు ఇబ్బడి ముబ్బడిగా కిరాయి ఇస్తూ ఆదాయం సొమ్ము చేసుకుంటున్నది. క్రీడలకు భారీ బడ్జెట్ అంటూ గాలి మాటలు చెబుతున్న ప్రభుత్వం ఇలా స్టేడియంలో ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ విమర్శల పాలవుతున్నది.
సంగీత కచేరీలు, మ్యూజికల్ నైట్స్ ద్వారా స్టేడియం రూపురేఖలను దెబ్బతీస్తున్న సాట్స్ ఇకనైనా క్రీడాటోర్నీలకు తప్ప మిగతా వాటికి ఉపయోగించవద్దంటూ క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. ప్రతీ రోజు మైదానంలో ప్రాక్టీస్ చేసుకునే పిల్లలు ఇలాంటి వాటి వాళ్ల తమ అద్భుతమైన కెరీర్లను ఆదిలోనే తుంచేసుకునే పరిస్థితికి ప్రభుత్వం తీసుకురావడంపై పలువురు మాజీ ప్లేయర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియాలను ఇప్పటి నుంచైనా క్రీడా టోర్నీలకు వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచిస్తున్నారు.