న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వార్షిక కాంట్రాక్టులను ఖరారు చేసింది. మొత్తం 34 మంది క్రికెటర్లతో సోమవారం జాబితాను విడుదల చేసింది. అక్టోబర్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు గాను బోర్డు క్రికెటర్లను ఎంపిక చేసింది. టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లు ‘రోకో’ జోడీగా పిలుచుకునే రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ టాప్‌గ్రేడ్ అయిన ‘ఏ+’లో చోటు నిలుపుకున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ..వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో వీరిద్దరితో పాటు బుమ్రా, జడేజా అత్యధికంగా 7 కోట్ల వేతనం అందుకోనున్నారు. దేశవాళీ క్రికెట్ ఆడలేదన్న కారణంతో బోర్డు ఆగ్రహానికి గురైన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్‌కిషన్ తిరిగి కాంట్రాక్టులు దక్కించుకున్నారు.
హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ గ్రేడ్-ఏలో చోటు నిలబెట్టుకున్నాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ఏపీ క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి, హర్షిత్ రానా సహా ఐదుగురికి కొత్తగా కాంట్రాక్టు దక్కింది. వార్షిక కాంట్రాక్టుల్లో ఏ+ గ్రేడ్ క్రికెటర్లకు ఏడాదికి రూ. 7 కోట్లు, ఏ విభాగానికి రూ. 5 కోట్లు, బీ, సీ కేటగిరీల్లో వరుసగా రూ. 3 కోట్లు, కోటి రూపాయలు దక్కనున్నాయి.
ఐపీఎల్లో తమ తమ ఫ్రాంచైజీల తరఫున అర్ధసెంచరీలతో రాణించిన మరుసటి రోజే విరాట్, రోహిత్ టాప్ గ్రేడ్‌లో చోటు నిలుపుకున్నారు. అయితే రానున్న ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆధారంగా రోహిత్‌శర్మ కెప్టెన్సీపై స్పష్టత రానుంది. రోహిత్ కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదా అన్నది చీఫ్ కోచ్ గౌతం గంభీర్ నిర్ణయంపై ఆధారపడనుంది. ఇదిలా ఉంటే సీనియర్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్‌తో పాటు అవేశ్‌ఖాన్, కేఎస్ భరత్, జితేశ్‌శర్మను బీసీసీఐ కాంట్రాక్టు జాబితా నుంచి తప్పించింది.