కొత్తపల్లి: కరీంనగర్ జిల్లా వేదికగా 10వ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర యోగా సంఘం, కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో మానేర్ స్కూల్లో పోటీలు జరిగాయి. ఈ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల నుంచి దాదాపు 700 మంది ప్లేయర్లు, 60 మంది కోచ్లు, మేనేజర్లు, సాంకేతిక అధికారులు హాజరయ్యారు. 8 నుంచి 45 ఏండ్ల వయస్సు ఉన్న పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన ప్లేయర్లు నవంబర్ 23 నుంచి 26 వరకు గువాహటిలో జరిగే జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపిక చేస్తారు.
అంతకుముందు మానేరు విద్యాసంస్థల అధినేత, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్యాట్రన్ అనంతరెడ్డి, యోగా సంఘం ప్రధాన కార్యదర్శి మనోహర్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. తొలిరోజు పోటీల్లో 8 నుంచి 10 ఏండ్ల బాలికల విభాగంలో నితిగ్నదరి(ప్రథమ), అభిలాషరెడ్డి(ద్వితీయ), అమరిస్(తృతీయ) ప్రతిభ చాటారు. బాలుర కేటగిరీలో చిన్మయ్రెడ్డి(రంగారెడ్డి), కుష్వక్రెడ్డి(హైదరాబాద్), మన్విత్రామ్(కరీంనగర్) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.